Snake Shedding Skin : పాము శరీరంపై వచ్చే కొత్త చర్మం పొరనే కుబుసం అంటారు. పాములు కుబుసం విడిచిపెట్టడం అత్యంత సహజమైన ప్రక్రియ అని పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి కేవలం పాముల్లోనే కనిపిస్తుంది. పాములు కుబుసం విడవకుంటే ముందుగా అవి చూపును కోల్పోతాయి. వేటాడేందుకు శరీరం సహకరించక ఇతర జంతువుల దాడికి గురవుతాయి. కుబుసంతో బొరియల్లోనే ఉండిపోతే నీరసించి చనిపోతాయి.
అసలు పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి? ఎన్ని రోజులకు ఒకసారి కుబుసం విడుస్తాయి? కుబుసం పదార్థాన్ని ముట్టుకోవచ్చా? కుబుసం విడిచే సమయంలో వాటిని చూస్తే ఏం జరుగుతుంది? అనే సందేహాలపై పూర్తి సమాచారం తెలుసుకుందాం.
గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?
కొన్ని జాతుల పాములకు కొత్త పొర ఏర్పడడం వల్ల పై పొర (కుబుసం) వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే పాములు కుబుసాన్ని ఒకేసారి వదిలేస్తాయి. పాముల శరీరం పెరుగుతున్నా కొద్దీ వాటి చర్మం కూడా కొత్తగా రూపొందుతుంది. అందుకే అవి కొత్త చర్మం రాగానే పాత చర్మాన్ని వదిలేస్తాయి.
కుబుసం వదలడం అంత సులభం కాదు. అందుకే పాములు కుబుసం విడవడానికి ముందుగా తమ తలను నేలకేసి రుద్దుకుంటుంది. కొద్దిగా చీలిక రాగానే మొత్తం చర్మం వదిలిపోయేలా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అది దాదాపు రహస్యప్రదేశంలోనే ఉంటుంది. అందుకే పొదలు, పుట్టలు, తెట్టెగోడలు, ఇంటి గోడల కన్నాల్లో పాము కుబుసాలు కనిపించడానికి కారణం అదే.
ప్రపంచంలో మూడు వేలకు పైగా పాము జాతులు ఉండగా దాదాపు అవన్నీ కుబుసం విడుస్తాయట. పాము పుట్టిన దగ్గర్నుంచి తన జీవితకాలంలో పలు సందర్భాల్లో కుబుసం విడుస్తుంది. శరీరం పెరుగుతున్నపుడల్లా పాత చర్మం బిగుతుగా మారి అసౌకర్యంగా ఉంటుంది. అది వేగంగా కదిలేందుకు, ఆహారాన్ని సేకరించుకునేందుకు ఇది ఆటంకంగా మారుతుంది. అందుకే అది బిగుతుగా మారిన పాత చర్మాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది.
పాము ఎప్పుడు కుబుసం విడుస్తుందంటే!
పాము తలపైనా కొత్త చర్మం అల్లుకుపోవడం వల్ల దాని కళ్లు మసకబారిపోతాయి. అవి నీలం రంగులోకి మారి చూపు తగ్గిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో తలను నేలకేసి రుద్దుకుంటుంది. దీంతో వెంటనే కుబుసాన్ని (పాత పొర) వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో రహస్య ప్రదేశంలో దాదాపు చీకటి ప్రాంతాల్లో సంచరిస్తుంది. వేటాడే అవకాశం లేకపోవడం వల్ల ఆహారం కూడా దొరకదు కాబట్టి ఆకలితో అలమటిస్తుంది. చర్మం వదులుకునే క్రమంలో చాలా నొప్పులు పడుతూ నీరసించి పోతుంది. అందుకే ఆ సమయంలో ఏ మాత్రం అలికిడి జరిగినా దాడి చేస్తుంది.
కుబుసాన్ని విడిచిన పాములు చాలా చురుకుగా ఉంటాయి. చిన్నపాటి అలజడికే వేగంగా స్పందిస్తాయి. ఆకలితో ఉంటాయి కాబట్టి చాలా ఉత్సాహంతో తిరుగుతుంటాయి. అందుకే అవి తన సమీపంలో చిన్న అలికిడి జరిగినా దాడి చేస్తాయి.
పాములు ఎన్నాళ్లకోసారి కుబుసం విడుస్తాయనే విషయంపై ఎలాంటి స్పష్టత లభించలేదు. వాటి జాతి, పెరుగుతున్న ప్రదేశం, ఆహార లభ్యత, వాతావరణం కొత్త చర్మం ఏర్పాటుకు దారి తీస్తాయి. పాములు విడిచిన కుబుసానికి ఎలాంటి విషం ఉండదు. దానిని ముట్టుకుంటే ఏమీ జరగదు. పట్టుకున్న తర్వాత చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పాములు కుబుసం విడుస్తున్నపుడు చూసినా ఏమీ హాని జరగదు. పాములు పగబట్టడం అనేది లేదని పరిశోధకులు చెప్తున్న మాట.
ఇంద్రధనస్సులో రంగులు సీతాకోక చిలుకలకు ఎలా వచ్చాయి? - ఎంతో ఆసక్తికరం
ఈ దీవి రోజులో అరగంట మాత్రమే కనిపిస్తుంది - ఆ తర్వాత అదృశ్యం అవుతుంది