How to Make Kanda Karam Podi : కొంతమందికి ఎన్నెన్ని కూరలు ఉన్నా కారప్పొడులతో రెండు ముద్దలు తింటేనే తృప్తిగా ఉంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది నువ్వులకారం, పల్లీపొడి, పుట్నాలకారం, కొబ్బరికారం, కందిపొడి, నల్లకారం, కరివేపాకుపొడి ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు. వీటిని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి దట్టించి తింటుంటే రుచి అద్దిరిపోతుంది. అయితే, రొటీన్‌గా అవే కాకుండా ఓసారి కంద కారం పొడి చేసుకోండి. ఈ కారం పొడి అన్నంతో పాటు, ఇడ్లీల్లోకి కూడా బాగుంటుంది. మరి సింపుల్‌గా కంద కారం పొడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కంద గడ్డ - సుమారు 350 గ్రాములు
- పల్లీలు - పావుకప్పు
- పచ్చిశనగపప్పు - టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 10
- ధనియాలు - అర టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 15
- మిరియాలు - అరటీస్పూన్
- నువ్వులు - టేబుల్‌స్పూన్
- బెల్లం - టేబుల్‌స్పూన్
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా చేతులకు నూనె రాసుకుని కందగడ్డ లోతుగా చెక్కు తీసుకోండి. ఆపై గ్రేటర్లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకోండి. ఈ తురుముని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై కంద తురుము వేసి అందులోని చెమ్మ ఆరిపోయే వరకు వేపుకోండి.
- కంద తురుము క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేసి దోరగా వేపుకోండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఆపై అదే పాన్‌లో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి కలుపుతూ ఎర్రగా వేపుకోండి. అనంతరం నువ్వులు వేసి చిట్లనివ్వండి. ఇక్కడ మీరు పుట్నాల పప్పు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు.
- ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో బెల్లం, చింతపండు వేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయండి.
- గ్రైండ్ చేసిన పొడిలో ముందుగా క్రిస్పీగా వేపుకున్న కందపొడి వేసి చేతితో కలపండి. అంతే ఎంతో రుచికరమైన కమ్మటి కంద పొడి రెడీ.
- ఈ కంద కారం పొడి అన్నంలోకి రుచి అద్దిరిపోతుంది.
- ఈ పొడి తయారీ విధానం నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
ఆహా! అనిపించే "బెండకాయ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్భుతమే!
ఆహా! అనిపించే "సొరకాయ గారెలు" - ఇలా చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!