Fake APP 20 Crores Rupees Fraud:ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటూ సైబర్ నేరగాళ్లు వలలు పన్నుతున్నారు. కాదేదీ సైబర్ నేరగాళ్లకు అనర్హం అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ప్రజలను మోసగించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో 20 కోట్ల రూపాయల భారీ మోసం వెలుగు చూసింది. ఈజీగా ఆన్లైన్లో భారీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశ చూపించి మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం:డీఏఏఐ అనే ట్రేడింగ్ యాప్ (DAAI APP)ను డ్వాక్రా పర్సన్లు పలమనేరులో వ్యాప్తి చేశారు. ఈ యాప్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపించారు. దీంతో దాదాపు 5 వేలమంది సుమారు 20 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఈ యాప్లో పెట్టినట్లు బాధితులు తెలిపారు. ద్విచక్ర వాహనాలను అమ్మి, బంగారాన్ని తాకట్టి పెట్టి వడ్డీలకు నగదు తెచ్చిమరీ యాప్లో పెట్టి నిండా మునిగిపోయామని వాపోతున్నారు.