Fake Currency In Agriculture Land :కొంత మంది తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో పక్కదారి పడుతుంటారు. దొంగతనాలు చేయడం, డ్రగ్స్ అమ్మడం, దొంగ నోట్లు ముద్రించి దందా ఇలాంటివి నిత్యం ఏదో మూల నుంచి వింటూనే ఉంటాం. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో పొలంలో నకిలీ నోట్లు దొరకడం కలకలం సృష్టించింది.
పొలంలో నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు :దామరచర్ల మండలంలో ఓ పొలంలో అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలిన నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు పడేసి ఉన్నాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచి పడి ఉండటాన్ని స్థానిక రైతులు సోమవారం ఉదయం గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిగిలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించి ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ నకిలీ నోట్లేనని, ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది విచారణలో తేలుతుందన్నారు.