Expode in Atchutapuram SEZ:అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలటంతో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సీఐ నరసింగరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్‌రౌత్(44)గా గుర్తించారు.
ప్రమాదం జరిగే సమయానికి ప్రదీప్ రౌత్ శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. రియాక్టర్ పక్కనే ఉండడంతో ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కార్మికుడి మృతిపై కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం సమాచారం అందించింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. వసంతా కెమికల్ పరిశ్రమలోకి ఎవరినీ అనుమతించడం లేదు. పేలుడు విషయాన్ని రహస్యంగా దాచి పెట్టారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆమె ఆరా తీశారు.
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కంపెనీ ప్రతినిధులకు సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణం న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు రూ.35 లక్షల పరిహారాన్ని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది.