Excise Deputy Commissioner About Liquor Shop Tenders :కొత్త మద్యం పాలసీ రాష్ట్రంలోని వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో ఒక్క వైన్ షాప్ దక్కినా చాలనే భావనతో మద్యం టెండర్ల దరఖాస్తులకు క్యూ కడుతున్నారు. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వేలం పాటకు కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో జిల్లాల్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపార వాంఛ, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారాలు జరుపుతున్న ఘటనలు అనేకం.
మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని చోట్ల దరఖాస్తులు చేసుకోనీయకుండా స్థానిక నేతల అనుచరులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 11న మద్యం దుకాణాలకు వేలంపాట నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరినే వేలంపాటకు ఆహ్వానిస్తామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు చెబుతున్నారు.