Illegal Liquor Supply Control in Telangana: ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అతిపెద్ద రెండో వనరు ఎక్సైజ్ శాఖ. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, లైసెన్స్‌లు, మద్యం దరఖాస్తుల ద్వారా 36 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ తరుణంలో అబ్కారీ శాఖను శాస్త్రీయంగా ప్రక్షాళన చేయడం, తద్వారా ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. విమర్శలకు తావు లేకుండా ప్రక్షాళన చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే దీర్ఘకాలికంగా ఒకే చోట పాతుకుపోయిన ఆబ్కారీ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బదిలీ చేసింది.
Excise Department Purge In Telangana: సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ ఎక్సైజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సహాయ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ ప్రక్రియ పూర్తి చేసింది. కల్తీ కల్లు, గుడుంబా అమ్మకాల పెరుగుదల వల్ల మద్యం అమ్మకాలపైనా ప్రభావం పడుతోంది. అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ రాబడికి గండి కొట్టే అధికారులు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
Excise Department Surveillance On Liquor : ప్రక్షాళన పద్ధతి ప్రకారం, వివాద రహితంగా, శాస్త్రీయంగా చేపట్టాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 141 ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో మూడేళ్ల నుంచి మద్యం అమ్మకాలు బ్రాండ్ల వారీగా పరిశీలన చేస్తారు. సర్కిళ్ల వారీగా డిమాండ్‌కు తగినట్లు ఆయా బ్రాండ్లను సరఫరా చేసే చర్యలు తీసుకుంటారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో గుడుంబా తయారీ, రవాణా జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.