Magunta Parvathamma Passed Away : ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ (77) అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. ఈమె ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వదిన, మాజీ ఎంపీ దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి. ఆమె వయస్సు రీత్యా అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇటీవల వారి కుమారుడు విజయ్ బాబు మృతి చెందారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొన్ని రోజుల నుంచి చెన్నైలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలు : మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించారు. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాలలో విద్యను అభ్యసించారు. మాగుంట పార్వతమ్మకు 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఒంగోలు ఎంపీగా ఉన్న సుబ్బరామరెడ్డి 1995లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు. 1996లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్వతమ్మ ఒంగోలు నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎంపికయ్యారు. మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.