Ex DCP Radha Kishan Rao Key Factsin Phone Tapping Case :తెలంగాణలోసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. భారత రాష్ట్ర సమితి పార్టీకి (బీఆర్ఎస్) ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టామన్నారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వివరించారు.
BRS Party Involvement in Phone Tapping : కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. అలానే జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచామన్నారు. అంతేకాకుండా కొందరు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించినట్లు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.