Ex Commissioner Vijay Kumar Reddy Filed Petition in High Court : సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. 'సాక్షి' మీడియాకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులో 'సాక్షి' పత్రిక, టీవీ ఛానల్‌కు కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా సమాచార, పౌరసంబంధాల శాఖ అప్పటి కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారంటూ ఏపీ మీడియా ఫెడరేషన్(ఏపీఎంఎఫ్) ప్రధాన కార్యదర్శి ఆర్.దిల్లీబాబురెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
'సాక్షి' పత్రికకు ప్రకటనలు : ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఆర్థిక నేరానికి పాల్పడ్డారన్నారు. ఆర్థిక నేర ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని, ఇలాంటి కేసులలో నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ రూ.వందల కోట్ల రూపాయలను 'సాక్షి' పత్రికకు ప్రకటనల రూపంలో దోచిపెట్టారన్నారు.