Hyderabad FTL And Buffer Zones Identified by Hydra :హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు చెరువుల ఆక్రమణదారుల్లోనే కాదు సమీపాన ఉండే సామాన్యుల్లోనూ గుబులు పుట్టిస్తున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది. హైడ్రా రాకను స్వాగతిస్తూనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై పూటకో మాట ప్రచారం కావడంతో కలవరపడుతున్నారు.
ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించే నివాసాలు, నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేయడం ఊరట కలిగించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్‌లో ఉన్న నిర్మాణాలు కూల్చక తప్పదని, ముందే వదిలేసి వెళ్లిపోవాలని ప్రకటించడం మరోసారి ఆందోళనకరంగా మారింది.
కూల్చివేతలకు హైడ్రా వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి :తమ నివాసాల అనుమతులు, హెచ్‌ఎండీఏ లేఔట్ల అప్రూవల్స్ సహా తదితర వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేసుకుంటున్నారు. అలాగే ఆయా చెరువులు పరిధిలోని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులను కలిసి వివరాలు ఆరా తీస్తున్నారు. గతంలో తమ చెరువులపై ప్రభుత్వాలకు అందిన ఫిర్యాదులు, చెరువుల విస్తీర్ణం, అన్యక్రాంతమైన వివరాలను కూడా సేకరించి పెట్టుకుంటున్నారు. అయితే ఈ దశలో హైడ్రా కూల్చివేతలు దిగే ముందు వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో : వాస్తవానికి ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. నీటి వనరుల్లోకి నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫ్టీఎల్‌గా పేర్కొంటారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ఎఫ్టీఎల్‌ను నిర్ధారిస్తాయి. చెరువు సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎఫ్టీఎల్ ఉంటుంది. అయితే వర్షాకాలంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే చెరువులు, కుంటలు నిండుకుండలుగా కనిపిస్తాయి. కానీ వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితుల్లో చాలా నీటి వనరులు బోసిపోయి కనిపిస్తాయి. చాలా వరకు ఖాళీ స్థలం కనిపిస్తుంది. చెట్లు పెరిగి చిత్తడిగా ఉంటుంది.
నీరు లేకుండా ఉన్నా ఆ ప్రాంతం ఎప్పటికైనా ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది. వాటి సమీపంలో కొందరికి పట్టా భూములుంటాయి. నీటి వనరుల పరిరక్షణ చట్టం, బిల్డింగ్ రూల్స్ 2012 ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోనూ, అందులో ఉన్న పట్టా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి. లేదంటే గ్రీన్ బెల్ట్‌గా వదిలేయాలి.
30 మీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టొద్దు : రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరే చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు అలుగు పొంగి ప్రవహించే మార్గాన్ని బఫర్‌గా భావించాలి. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్‌కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ పరిధిలో చెరువు సరిహద్దు నుంచి 50 మీటర్లు ఎఫ్టీఎల్‌గా నిర్ధారిస్తారు.