Budameru Floods Reason :బుడమేరు అనేది జలవనరుల శాఖ పరిబాషలో ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టింది. పలు వాగుల కలయికతో ప్రవహించి విజయవాడ నగరానికి సమీపంగా వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో కొన్ని వాగులు, పులివాగు, బీమ్‌వాగు, లోయవాగు వస్తుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి మరికొన్ని చిన్న ఏరులు కలుస్తాయి. ఇవన్నీ వెలగలేరు మీదుగా సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు , గుడివాడ, నందివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. పంటపొలల నుంచి నీరు దీని ద్వారా వదులుతారు.
సామర్థ్యం చాలా తక్కువ :ఈ బుడమేరు గరిష్ఠంగా 11,000ల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించే సామర్థ్యం ఉంది. అంతకంటే ఈ డ్రెయిన్ సామర్థ్యం లేదు. బుడమేరు ఉద్ధృతిని తగ్గించేందుకు 1970 ప్రాంతంలో పీడబ్ల్యూడీ శాఖ జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మాణం చేసింది. దీంతో అక్కడ నీరు నిలువ ఉండి చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని క్రమబద్దీకరించేవారు. దీనికే ఒక మళ్లింపు కాలువ తవ్వారు. బుడమేరు డైవర్షన్ ఛానెల్ ద్వారా అధిక వరద వస్తే ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణా నది పవిత్ర సంగమంలో కలుస్తుంది. ఈ ఛానెల్ ద్వారా వీటీపీఎస్‌లో వృథా నీటిని విడుదల చేసి కృష్ణానదికి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.
బుడమేరుకు 2005లో భారీగా వరదలు వచ్చాయి. అప్పుడు దాదాపు 60,000ల నుంచి 70,000ల క్యూసెక్కులు వచ్చిన వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. బుడమేరుకు వచ్చే వరదను విజయవాడ నగరం మీదకు రాకుండా ఉండాలంటే మళ్లింపు కాలువ ఒక్కటే మార్గమని ప్రతిపాదించారు. ఆ తర్వాత పోలవరం కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు.
Vijayawada Floods Updates : పోలవరం కుడికాలువ సామర్థ్యం 37,500 క్యూసెక్కులకు డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత కొన్నేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్‌లో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10,000ల క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉంది. అప్పట్లో వీటీపీఎస్ యాజమాన్యం అంగీకరించలేదని వైఎస్ ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణను వదిలేసింది. దీంతో వరద ఎక్కువ వచ్చినా డైవర్షన్ ఛానల్ నుంచి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. పైగా బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణానదిలో కలవాలంటే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల వరకే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బుడమేరులో నీరు వెనక్కి తన్నుతుంది.
ఆక్రమణలే ప్రస్తుత ముంపునకు కారణం : ఖమ్మం ప్రాంతంలోనూ స్థానికంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అంచనా ప్రకారం 60,000ల క్యూసెక్కులు పైగా వచ్చింది. దీంతో బుడమేరు డైవర్షన్ ఛానెల్ పలుచోట్ల గండి పడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది. జక్కంపూడి, సింగ్‌నగర్, వాంబేకాలనీ, పాలఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు మునిగిపోయాయి. గత మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్నాయి. సింగ్‌నగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది. ఏళ్లుగా బుడమేరు విస్తరణకు నోచుకోకపోవడంతో పాటు ఆక్రమణల ఫలితమే ప్రస్తుత ముంపునకు కారణమని స్థానికులు చెబుతున్నారు.