All Set For AP Election Polling:రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల పోలింగ్‌కు, సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్‌సభ, అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈవీఎం లు, ఇతర సామగ్రితో సిబ్బంది, ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రీపోలింగ్ లేకుండా హింసరహిత పోలింగే లక్ష్యమన్న ఈసీ, గత ఎన్నికల కన్నా 10 వేల మంది కేంద్ర బలగాల్ని అదనంగా మోహరించింది.
సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో, పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుష ఓటర్లు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు, 46 వేల 389 కేంద్రాల్ని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎం (EVM) లు వినియోగిస్తోంది. వాటి పనితీరును రెండుసార్లు పరిశీలించిన అధికారులు, జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
సోమవారం ఉదయం ఐదున్నరకు, ఏజంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 7గంటలకు మొదలయ్యే ఓటింగ్ 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. ఓటేసేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.! ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, 34వేల 165 పోలింగ్ కేంద్రాల్లో, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో వందశాతం మేర వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు.