Pawan Kalyan Comments on Law and Order:శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంకా అధికారులు వైఎస్సార్సీపీలో వ్యవహరిస్తున్నట్లే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో మాదిరిగా ప్రవర్తిస్తే నేను ఊరుకునేవాణ్ని కాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది:అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటానని నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే నిజాయతీతో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనిత మరింత చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలు ఇప్పుడూ కొనసాగుతున్నాయని అన్నారు. అలానే డీజీపీ, పోలీసు అధికారులు తీరు మార్చుకోవాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే ఆ పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలపై అధికారులకు అలవాటు తప్పింది:గత ఐదేళ్లలో 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం జగన్ కనీసం మాట్లడలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులెలా వారసత్వంగా వస్తాయో గత ప్రభుత్వ తప్పిదాలు, నేరాలు కూడా అలానే వచ్చాయని అన్నారు. శాంతిభద్రతలను బలంగా అమలు చేయాలని పదేపదే చెప్పానని కాని శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు అలవాటు తప్పిందని పవన్ వివరించారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఇవాళ ధర్మబద్ధంగా చేయండని ప్రాధేయపడుతున్నా మీనమేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు దేనికి మీనమేషాలు లెక్కపెడుతున్నారో అర్థం కావట్లేదని తెలిపారు.