Drinking Water Sale in RO Plants Without Complying With Norms:రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఆర్వోప్లాంట్లు పెరిగిపోవడం, వాటికి లైసెన్స్‌లు లేకపోవడం, తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, కాసుల కోసం నిబంధనలు పాటించకుండా కొందరు ప్లాంట్ల యజమానులు వ్యవహరించడంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం శివారు కాలనీ లెనిన్‌నగర్‌లో అతిసారం ప్రబలి వారం వ్యవధిలో ఏడుగురు మృతిచెందడం, పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలవడం వెనుక కలుషిత నీరే కారణమని తేలింది. అయితే వీరంతా తాగింది డబ్బా నీరు కావడం ఆందోళన కలిగిస్తోంది. చివరకు డబ్బులిచ్చి రోగాలు కొనితెచ్చుకుంటున్నామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
అధికారులు చిన్నచూపు:కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ గత ఐదేళ్లుగా అస్తవ్యస్తంగా ఉండడం శివారు కాలనీ అని మున్సిపాలిటీ అధికారులు చిన్నచూపు చూడడంతో డయేరియా విజృంభిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మురుగుకాల్వల పూడికతీత చేపట్టక మురుగునీరు సాఫీగా ముందుకు కదలడం లేదు. ఎక్కడికక్కడే ఆగిపోవడంతో బోరునీరు కలుషితమైంది. భూగర్భ జలాలను మోటారు బోరు ద్వారా ట్యాంకులకు సరఫరా చేసుకుని శుద్ధి చేయకుండా ఆర్వో ప్లాంట్ల వారు వినియోగదారులకు విక్రయించడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. తాగేనీటికి పీహెచ్ ఎల్లప్పుడూ 6.6 ఉండాలి. నీటిలో ఎలాంటి క్రిములున్నాయి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉన్నాయా అని నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు కొందరు అసలు పీహెచ్ మీటర్‌నే ఉపయోగించడం లేదని పరిశీలనలో తేలింది.
అసలే వర్షాకాలం, ఆపై రంగుమారిన తాగునీరు- విజయనగర వాసులను వణికిస్తోన్న వ్యాధుల భయం - polluted water
తప్పనిసరిగా పీహెచ్, టీడీఎస్ చెక్: తాగేనీటికి టీడీఎస్ 30 ఉండాలి. బోరు నీరు అంటే భూగర్భజలానికి ఈ టీడీఎస్ 120 నుంచి 150 ఉంటుంది. పీహెచ్ 7కు పైగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా బోరు నీటికి ఆ తర్వాత నీటిని శుద్ధిచేశాక పీహెచ్, టీడీఎస్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి. రెండింటిలో వ్యత్యాసం గమనించాలి. అన్ని సరిగా ఉన్నాకే నీటిని వినియోగదారులకు అమ్మాలి. వీధుల్లో వెలిసే ఆర్వోప్లాంట్లలో చదువుకునేవారు ఉండరు. ఏదో ట్యాంకు పెట్టేసి లోపల యంత్రాన్ని అమర్చి నీటిని అందులోంచి రివర్స్ ఆస్మోసిస్ చేసి అమ్ముతున్నారు తప్పించి ప్రమాణాలు పాటించడం లేదు.
మున్సిపాలిటీ లైసెన్స్ తప్పనిసరి:ఆర్వోప్లాంట్ నిర్మించేటప్పుడు మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అధికారులు కూడా వచ్చి అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకుని లైసెన్స్ ఇవ్వాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. పిడుగురాళ్లలో సరైన ప్రమాణాలు పాటించని నాలుగు ఆర్వోప్లాంట్లను మూసేశారు. ఇంకా తనిఖీలు చేస్తే చాలా బయటపడతాయి. ఆర్వోప్లాంట్లకు ఎవరూ లైసెన్స్‌లకు దరఖాస్తు చేయడం లేదు. అటు పురపాలక సిబ్బంది కూడా తనిఖీలు చేయడం లేదు. ఈ ప్లాంట్లలో ప్లాస్టిక్ ట్యాంకులను వాడుతున్నారు. స్టీల్ ట్యాంకులనే వాడాలి. కానీ ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. 15 రోజులకోసారి ట్యాంకును శుభ్రపరిచి, ఎప్పుడు శుభ్రపరిచారో ట్యాంకుపై రాయాలి. ప్లాంట్‌కు సమీపంలో మురుగుకాల్వలు ఉండకూడదు. అంతేకాకుండా ఆర్వోప్లాంట్ పేరిట నీటిని ప్లాస్టిక్ ట్యాంకుల్లో వీధుల్లోకి వెళ్లి అమ్ముతున్నారు. ఆ ట్యాంకులను శుభ్రపరచడం లేదు.
పల్నాడు జిల్లాలో డయేరియా అలజడి- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులు - Diarrhea Cases in Palnadu District
ప్రమాణాలు పాటిస్తున్నారా:డబ్బాలను ఆరునెలలకు ఒకసారి మార్చి కొత్తవి వినియోగించాలి. కానీ ప్లాంట్ యజమానులు అలా చేయడం లేదు. ఏళ్ల తరబడి డబ్బాలను వాడుతున్నారు. లోపల పాచిపట్టి ఉన్నా శుభ్రం చేయడం లేదు. మూడు అంచెల్లో వాటిని శుభ్రపరచాలి. అలా జరగడం లేదు. జిల్లాలోని అన్ని ఆర్వోప్లాంట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? నీటి పరీక్షలు చేస్తున్నారా? లేదా? డబ్బాలు ఎలా ఉన్నాయి? చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలించి చర్యలు తీసుకుంటే మరోచోట ప్రాణాలు పోయే స్థితి రాకుండా ఉంటుందని జిల్లా వాసులు భావిస్తున్నారు.
మినరల్ అనుకుంటే పొరపాటే:ఆర్వో ప్లాంట్లలో అమ్మేది మినరల్ నీరు అని అపోహ పడుతుంటారు. సాధారణంగా నీళ్లలో సోడియం సల్ఫేట్, కాల్షియం కార్బొనేట్, పొటాషియం, మెగ్నీషియం సల్ఫేట్ లాంటి కొన్ని ఖనిజాలను అదనంగా కలిపితే మినరల్ నీరు అంటారు. కానీ ఇవీ కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రమే పాటిస్తాయి. వీధుల్లో ఉండే ఆర్వోప్లాంట్ల నిర్వాహకులు చేయలేరు. ప్రభుత్వం సరఫరా చేసే నీరు సక్రమంగా ఉంటే ఆర్వో పద్ధతి అవసరం ఉండదంటారు నిపుణులు. మున్సిపల్ నీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
జల్‌జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review