Drinking Water Problems in Guntur Auto Nagar : గుంటూరు ప్రజలు ఓ పక్క కలుషిత నీటి సరఫరాతో ఇక్కట్లు పడుతుంటే మరోపక్క ఆటోనగర్ వాసులు గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నారు. గుంటూరు శివారు విజయవాడ రహదారిలో 40 ఏళ్ల కిందట ఆటోనగర్ ఏర్పాటు చేయగా నేటికీ అక్కడికి సరైన మంచినీటి సరఫరా (Supply) లేదు. ఆటోమొబైల్ రంగంలో విడిభాగాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో దాదాపు 3 వేలకు పైగా పరిశ్రమలున్నాయి. ఫోర్డ్, కియా, టాటా, మారుతీ, వోక్సోవ్యాగన్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల షోరూమ్‌లు ఉన్నాయి. సుమారు 30 వేల మందికి పైగా ఇక్కడ ఉపాధి (employment) పొందుతున్నారు. వీరంతా గొంతు తడుపుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.
Drinking Water Crisis Guntur : ఆటోనగర్‌కు కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులే కాకుండా నిత్యం వందలాది మంది వాహనాల మరమ్మతుల పనుల మీద వస్తుంటారు. వీరికి తాగునీరు అందించడంపై ఏపీఐఐసీ (APIIC), కార్పొరేషన్ దృష్టి సారించ లేదు. ఫలితంగా వారందరికీ గొంతెండుతోంది. దుకాణాలు, హోటళ్లలో స్థానికులు నీరు కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఏపీఐఐసీ ఆటోనగర్‌కు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 6 కోట్ల నిధులు ఇచ్చింది. అందులో 4.5 కోట్ల రూపాయలతో తక్కెళ్లపాడు తాగునీటి (Drinking Water) శుద్ధి కేంద్రం నుంచి ఆటోనగర్‌కు పైపులైన్లు, రిజర్వాయర్, సరఫరా పైపులైను వ్యవస్థను కొంతమేరకు సిద్ధం చేశారు. కార్పొరేషన్ పెద్ద నీటి కనెక్షన్‌కు 55 వేలు, చిన్న కుళాయికి 18 వేలు చెల్లించమనడంతో స్థానిక పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారులు, దుకాణదారులు ముందుకు రాలేదు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పైపులైన్ల పనులు నిలిచిపోయాయి.
ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు
'ఒక్క నీటి పంపు లేదు. పేరుకి ఒక వాటర్ ట్యాంకర్ ఉన్నా దాని వల్ల ఉపయోగం లేదు. ఎన్నో ఏళ్లుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. కుళాయి, పంపులు లేవు, వాటర్ ట్యాంకులు తెచ్చుకుని పనులు చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి మాకు తాగునీటి సౌకర్యం కల్పించండి. ' - ఆటోనగర్ కార్మికులు