DOG ATTACKS ON PEOPLE : ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. చిన్నారులపై వీధికుక్కలు విరుచుకుపడుతున్నాయి. పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి. రోజురోజుకీ కుక్కల సంఖ్య పెరుగుతుండగా, వాటిని చూసి మహిళలు, చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో అనుకోని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నడూ లేనంతగా కుక్కల దాడులు పెరిగిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు గణాంకాలు చూస్తే తీవ్రత అర్థమవుతుంది. కృష్ణా జిల్లాలో మొత్తం బాధితులు 3 వేల 3 మంది కాగా, ఇందులో ఐదేళ్లలోపు వారు 188 మంది బాధితులు కాగా, ఐదేళ్లు పైబడినవారు 2815 మంది ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 3 వేల 881 మంది బాధితులు ఉండగా, ఇందులో ఐదేళ్లలోపువారు 234 మంది వరకు ఉన్నారు. తాజాగా పెనుగంచిప్రోలుకి చెందిన ఏడాది బాలుడు ప్రేమ్‌కుమార్ కుక్కల స్వైరవిహారానికి బలయ్యాడు.
ఆ బాలుడ్ని నోట కరుచుకుని దూరంగా లాక్కుపోయిన శునకాలు, తీవ్ర గాయాలు చేశాయి. చివరకు బాలుడిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. కృష్ణా జిల్లా చెన్నూరు చెందిన ఏడు సంవత్సరాలున్న హేమశ్రీ ఇంటి వద్ద ఆడుకుంటుంటే వీధికుక్క వచ్చి దాడిచేసింది. వెంటనే తల్లి జయలక్ష్మి కుక్కను బెదరగొట్టడంతో వదిలేసింది. ముఖంపై తీవ్ర గాయమైంది. మచిలీపట్నం జీజీహెచ్‌లో రెండు రోజులు చికిత్స తీసుకున్నారు. సమీపంలోని పీహెచ్‌సీలో ఇంజక్షన్లు తీసుకొంటున్నారు.
పన్నెండేళ్లకు పుత్ర సంతానం - వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం: గత ఐదేళ్ల పాలనలో వీధికుక్కల నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడో ఓ చోట శునకాల దాడిలో ప్రాణాలు పోవడం, తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు జరిగితే గానీ అధికారుల్లో చలనం ఉండటంలేదు. తాజాగా పెనుగంచిప్రోలులో ప్రేమ్‌కుమార్ వీధికుక్కల దాడిలో మృతి చెందిన ఘటనతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కూటమి ప్రభుత్వం వీధికుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని, వాటికి వ్యాధి నిరోధక టీకాలు, కు.ని. శస్త్రచికిత్సలు చేయించాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటి సంతతి రోజు రోజుకూ పెరుగుతోంది. ఒంటరిగా బయటకొస్తే వెంబడిస్తున్నాయి.
ప్రజలు నిత్యం ఏదో ఒకచోట వీటి బారిన పడుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా వెనకాల నుంచి వచ్చి పిక్కలు పట్టేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా ఆటలాడుకునే చిన్నారులు, పాదచారులు, మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వీధికుక్కల నియంత్రణ నగర, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కష్టంగా మారింది. జీవ వ్యర్థాలు, వృథా ఆహారం కాస్త ఎక్కువగా లభించే ప్రాంతాలలో కుక్కల బెడద అధికంగా ఉంటోంది. ఫంక్షన్ హాళ్లు, మాంసం దుకాణాల వద్ద ఆహారం కొరత ఏర్పడినపుడు శునకాలు జనావాసాల వైపు దండెత్తి జనాలను గాయపరుస్తున్నాయి.
రోడ్లపై తిష్ట వేస్తోన్న కుక్కలు, ఆవులు - వాహనదారులకు చుక్కలు - Dogs and Cows are Roaming on Roads
వేలల్లో కేసులు నమోదు: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 6884 మంది గాయపడ్డారు. వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులే 422 మంది ఉన్నారు. పదకొండు నెలల వ్యవధిలోనే ఇన్ని వేల కేసులు నమోదయ్యాయంటే వీటి బెడద ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. పలు గ్రామాల్లో పిచ్చి కుక్కలు దాడులు చేస్తున్నాయి. రోజూ పదుల సంఖ్యలో బాధితులు జిల్లా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు. పిల్లలను సెలవురోజుల్లో ఆడుకునేందుకు పంపించాలంటే భయపడాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 49 వేల వరకు వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటికి ఆయా జిల్లా కేంద్రాల్లో కుక్కల నియంత్రణ సంరక్షణ కేంద్రాల ద్వారా యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) చికిత్సలు చేయాలి. అయితే క్షేత్ర స్థాయిలో అలా జరగడంలేదు.
విజయవాడ మున్సిపాలిటీలో ఏబీసీ శస్త్రచికిత్సలు, యాంటీ రాబిస్ టీకాలు దశలు వారీగా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ 2019కి ముందు 13 వేలు వరకు ఉన్న వీధికుక్కలు ఇప్పుడు అవి, సుమారు 30 వేలకు పెరిగాయి. దశల వారీగా జరిగిన ఈ చికిత్సల్లో కొన్ని నెలలపాటు జరగకపోవడంతో అవి సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. జిల్లా, మున్సిపల్ అధికారులు చొరవతీసుకొని ప్రత్యేక శిబిరాలు ద్వారా ఏబీసీ శస్త్రచికిత్సలు చేయిస్తే, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కుక్కల నియంత్రణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
నెలకు సుమారుగా 900 కేసుల పైబడి విజయవాడ జీజీహెచ్‌కు కేసులు వస్తున్నాయి. బాధితులకు ఇంజక్షన్లు వేస్తూ వైద్యులు ఉపశమనం కల్గిస్తున్నారు. కుక్కలు కరిచిన తర్వాత ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగైతే సులువుగా వైరస్‌ను నియంత్రించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. నానాటికీ అపరిమితంగా పెరిగిపోతున్న కుక్కలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. లేకుంటే శునకాల దాడుల్లో గాయాలు పాలయ్యేవారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.
డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK