ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు మృతి - పలువురు అస్వస్థత - TIRUPATI STAMPEDE DEVOTEES DIED

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు - భక్తుల రద్దీతో టీటీడీ నిర్ణయంలో మార్పు, తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయం

Tirumala Temple
Tirumala Temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 9:14 PM IST

Updated : Jan 8, 2025, 10:39 PM IST

TIRUPATI STAMPEDE DEVOTEES DIED: తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా, శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు.

బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్‌ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మొత్తంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అదే విధంగా సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా అస్వస్థతకు గురై రుయా ఆస్పత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మంది చేరారు.

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట - నలుగురు మృతి (ETV Bharat)

భక్తుల రద్దీతో టీటీడీ నిర్ణయంలో మార్పు:భక్తుల రద్దీతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయించారు. భక్తులు భారీగా తరలిరావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు.భక్తుల రద్దీని అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్దకు అదనపు బలగాలను తరలించారు.

ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం:కాగా వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు రోడ్లపై గుమికూడకుండా సిబ్బంది పార్కులో ఉంచారు. పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద షెడ్లు వేసి భక్తులను ఉంచారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి: తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు నాయుడుదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు: కాగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజుకు 40 వేల చొప్పున 3 రోజుల్లో 1.2 లక్షల టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం 5 గంటలకు దర్శన టికెట్లను జారీ చేస్తామని టీటీడీ ప్రకటించడంతో తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు తిరుపతిలోని స్ధానికులు తరలివచ్చారు. టీడీడీ ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రాలలో సాయంత్రం నుంచి భక్తులు వేచి ఉన్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లలోకి ప్రవేశించే సమయంలో తోపులాటలు చోటు చేసుకున్నాయి.

సాయంత్రం కేంద్రాల వద్ద బారులు:పోలీసులు భక్తులను వరుస క్రమంలో పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. నగరంలోని శ్రీనివాసం, విష్ణునివాసం, రామచంద్ర పుష్కరణి, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఎమ్మార్ పల్లి జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్, ఇందిరా మైదానం కేంద్రాలలో టికెట్లు జారీ చేయనున్నారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్ - కొండపైకి మాస్క్​తో రండి

Last Updated : Jan 8, 2025, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details