Discord in Navy Preparatory Exercises In Visakhapatnam : విశాఖ తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 4న జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి రెండు ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో గాలి అనుకూలించకపోవడంతో ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆకట్టుకున్న లేజర్, డ్రోన్ షోలు : సముద్రంలో సుమారు 12 నౌకల పైనుంచి నిర్వహించిన లేజర్ షో ఆకట్టుకుంది. అనంతరం డ్రోన్ షో చేపట్టారు. దేశ చిత్రపటం, నౌక, సబ్‌మెరైన్, ఫైటర్ జెట్, యుద్ధ ట్యాంకులు, సైనికుడు, కళింగ చక్రవర్తి, మేకిన్ ఇండియా, సింహం వంటి ఆకృతులను డ్రోన్ షోలో ప్రదర్శించారు.