Seismology Centers in AP :ఏపీ వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది. ఇటీవల విజయవాడ, జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లాలో వచ్చిన స్వల్ప ప్రకంపనల నేపథ్యంలో ఈ సెస్మోలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడో ఇండో-నేపాల్ సరిహద్దుల్లో భూకంపం వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట, విజయవాడల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక బంగాళాఖాతానికి ఆవల ఉన్న ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో భూమి ప్రకోపించినా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ప్రకంపనలు వచ్చి భయపెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా భూ ప్రకంపనల్ని కొలిచేందుకు, రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రతను నమోదు చేసేందుకు భూకంప లేఖిని కేంద్రాలు లేవు. దీంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెస్మోలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలన్నీ జోన్-3లో ఉన్నాయి. అంటే తక్కువ స్థాయి ప్రకంపనలు మాత్రమే ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకించి విజయవాడ పరిసరాల్లో ఉన్న ప్రాంతాలన్నీ జోన్-3లో ఉంటే, విశాఖ ఆ సమీపంలో ఉన్న ప్రాంతాలు జోన్-2లో ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 3 కంటే తక్కువ తీవ్రత ఈ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల వచ్చిన ప్రకంపనల స్థాయి కూడా 1.5 నుంచి 2.3 వరకూ ఉందని అంచనా. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోనే స్వల్ప స్థాయి ప్రకంపనలకు ఆస్కారం భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే విపరీతంగా పెరిగిపోయిన మైనింగ్ లోతుగా బోర్‌వెల్స్ తవ్వడం వంటివి భూ ప్రకంపనలకు కారణాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.