ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిద్రపోతున్న 'నిఘా'నేత్రం - ఎలా చిక్కేను సాక్ష్యం! - CC CAMERAS IN VISAKHAPATNAM

వైఎస్సార్సీపీ హయాంలో నిఘాపై నిర్లక్ష్యం - విశాఖలో మూలకు చేరిన వేలాది సీసీ కెమెరాలు

CC Cameras in Visakhapatnam
CC Cameras in Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 12:11 PM IST

CC Cameras in Visakhapatnam : విశాఖ మహా నగరంలో నిఘా కళ్లు మూసుకున్నాయి. పలు కీలక కేసుల్లో ఆధారాలు జారిపోతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో నిఘాపై నిర్లక్ష్యం చోటు చేసుకుంది. కెమెరాలకు నిర్వహణ కరవై మరమ్మతులతో మూలకు చేర్చారు. ఆ వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖలో శాంతిభద్రతలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో సీసీ కెమెరాలపై పోలీస్‌ స్టేషన్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఇందులో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో వేలాది సీసీ కెమెరాలు పని చేయడం లేదని తేలింది.

ఆశ్చర్యపోయిన హోంమంత్రి : విశాఖలో సీసీ కెమెరాల నిర్వహణకు నిధుల్లేక మూలకు చేరాయని ఇటీవల సమీక్షలో తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆశ్చర్యపోయారు. వెంటనే నగరంలో ఎన్ని కెమెరాలు మూలకు చేరాయి? కొత్తవి ఏ ప్రదేశాల్లో ఎన్ని అవసరం ఉంటుంది? అనే అంశంపై నిశితంగా సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఆధారాలకు అవస్థలు : గత సంవత్సరం నవంబర్​లో చేపల రేవు (హార్బర్‌)లో అగ్ని ప్రమాదం జరిగింది. జీరో జెట్టీ వద్ద ఎవరు బోటులో నిప్పురాజేశారన్న విచారణలో భాగంగా హార్బర్‌ సమీపంలోని 11 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఖంగుతిన్నారు. అందులో కొన్నింటికి కనెక్షన్లే ఇవ్వలేదు. మరికొన్ని నిర్వహణలేక మూలకు చేరాయి. కీలకమైన ఈ కేసు విచారణలో జాప్యానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఓ ముఖ్య కారణం. ఇలాంటి పరిస్థితి ఎన్నోసార్లు ఎదురయింది.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి బీచ్‌లో పురుగులు మందు తాగుతున్న వీడియో బంధువులకు పంపి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. ఈ విషయమై వారు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బీచ్‌ రోడ్‌లో పలుచోట్ల సీసీ కెమెరాలు పరిశీలించారు. సింహభాగం పనిచేయనట్లు కంట్రోల్‌ రూంలో గుర్తించారు. ఓ మాజీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ సమయంలోనూ రుషికొండ ప్రాంతంలో పలు చోట్ల సీసీ కెమెరాలే లేవని తేలింది.

కారణాలివే : ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత ఎవరిదనేది ప్రశ్నగా మారింది. గతంలో ఓ సంస్థ సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తే, ఐదు సంవత్సరాలు ఉచితంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. సంస్థ గడువు ముగియడంతో కెమెరాల నిర్వహణ అటకెక్కింది. మరోవైపు ఆకర్షణీయ నగర ప్రాజెక్టులో భాగంగా (సిటీ ఆపరేషన్‌ సెంటర్స్‌) కింద ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాలతో కూడిన స్మార్ట్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ ఓ కంపెనీ చూస్తుండగా, గత వైఎస్సార్సీపీ సర్కార్​లో బిల్లులు బకాయిలుండటంతో చేతులెత్తేశారు.

ప్రత్యేక సమావేశంలో చర్చిస్తాం :జీవీఎంసీలో సీసీ కెమేరాలపైనే ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. నగరంలో సీసీ కెమెరాలు ఎక్కడ అవసరం? ఉన్నా ఎక్కడ పనిచేయడం లేదు? అనే విషయంపై కమిషనరేట్‌ పరిధిలోని ఆయా స్టేషన్ల పరిధిలో సర్వే చేయించామని చెప్పారు. వాటిని జోన్లు వారీగా జీవీఎంసీ కమిషనర్​కి ఇస్తామని పేర్కొన్నారు. పబ్లిక్‌ శక్తి యాక్టు కింద అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద వంద శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నామని సీపీ వెల్లడించారు.

  • నగరంలో ప్రభుత్వ సీసీ కెమెరాలు : 2,367
  • ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినవి : 61,466
  • జీవీఎంసీ కెమెరాల్లో మూలకు చేరినవి : 1,308
  • ప్రైవేట్​లో పనిచేయనవి : 6,521
  • కొత్తగా కావాల్సినవి : 14,307

నిఘా నీడలో రాజధాని - రియల్‌టైం గవర్నెన్స్ అమలుకు ప్రభుత్వం సిద్ధం

సీసీ కెమెరాలు, వాక్యూమ్ టాయిలెట్లు, మేగజైన్లు- వందేభారత్ స్లీపర్ కోచ్ రెడీ!

ABOUT THE AUTHOR

...view details