Different Types Of Darshan information at Tirumala Temple : ఆ ఏడుకొండలపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లది మంది భక్తులు తపిస్తుంటారు. తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు. ఆ శ్రీవారి దర్శన మార్గాలు, టికెట్లు, అవకాశాల పైనే భక్తులకు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో టిటీడీ కల్పిస్తున్న అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భక్తులు ఆరాటపడుతుంటారు. అందుకే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఆ శ్రీనివాసుడి దర్శన అవకాశాలు, ఇతర వివరాలపై ప్రత్యేక కథనం.
తిరుమల కొండకు ప్రణాళికాబద్ధంగా వచ్చే భక్తులకు శ్రీనివాసుడి దర్శనం కష్టమేమి కాదు. ప్రస్తుతం టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు వ్యయప్రయాసలను తప్పించుకోవచ్చు. గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో నిరీక్షణ కష్టాలు లేకుండ దూరం కావచ్చు. దర్శనాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఇలా నిత్య శోభితంగా విరాజిల్లే ఆ సప్తగిరుల్లో దివ్యానుభూతిని పొందవచ్చు. దర్శన మార్గాలివి.
శ్రీవారి సర్వదర్శనం...
తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా ఆ శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరందరిని క్యూలైన్ల నుంచి వైకుంఠం-2లోని 32 గదుల గుండా (ఒక్కో గదిలో 450 మంది వరకు) పంపిస్తారు. అక్కడినుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటుచేసిన మరో తొమ్మిది కంపార్టుమెంట్లలో (ఒక్కో దానిలో 900 మంది) దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. చివరికి అవీ కూడా నిండితే క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తుంది.
క్యూలైన్ నుంచి వైకుంఠం-2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకు ఉంటుందో సూచిస్తూ ఓ టోకెన్ ఇస్తారు. దర్శనానికి ఎక్కువ సమయం ఉంటే అక్కడినుంచి బయటకు వచ్చి కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్టుమెంటులోకి నేరుగా వెళ్లవచ్చు.
సౌకర్యాలు :కంపార్టుమెంట్లు, గదుల్లో ఉండే భక్తులకు టీటీడీ సిబ్బంది భోజనం, టీ, పాలు సరఫరా చేస్తారు. అలాగే అవసరార్థులకు వైద్య సదుపాయమూ కూడా లభిస్తుంది. అదేవిధంగా క్యూలైన్లలో ఉన్న భక్కులకు ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
దర్శనానికి పట్టే సమయం : సుమారు 15 నుంచి 16 గంటలు పడుతుంది. రద్దీ రోజుల్లో మరింత ఎక్కువ.
- స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ)...
సర్వదర్శనం గుండ వచ్చే భక్తులకు నిర్దేశిత సమయాన్ని సూచిస్తూ శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్ టోకెన్ ఇస్తారు. వారికి నిర్దేశించిన సమయానికి వైకుంఠం-1 నుంచి కంపార్టుమెంట్లలోకి వెళ్లాలి. అలిపిరి వైపు నుంచి తిరుమల కొండపైకి నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శన టోకెన్లు తీసుకోవచ్చు.
- దర్శనానికి పట్టే సమయం: సాధారణ రోజుల్లో 4 గంటలు ఉంటుంది. రద్దీ రోజుల్లో 7 నుంచి 8 గంటలు.
- టికెట్లు ఎక్కడెక్కడ? : తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు, శ్రీనివాసం.
- ఎప్పుడు ఇస్తారు?: తెల్లవారుజామున 4 గంటల నుంచి.
- రోజుకు ఎన్ని టోకెన్లు: తిరుపతిలో 14 వేలు, శ్రీవారిమెట్టు వద్ద 6 వేలు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ రూ.300..
దీనికి మూడు నెలల ముందు ఆన్‌లైన్‌లో టికెట్లు ఇస్తారు. టికెట్‌లో నిర్దేశించిన టైంకు వైకుంఠం-1 వద్దకు చేరుకోవాలి. 12ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
దర్శనానికి పట్టే సమయం: సుమారు 3 నుంచి 4 గంటలు.
బుక్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్:https://ttdevasthanams.ap.gov.in
- ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ)...
వారి పాస్‌పోర్టుపై ఇమ్మిగ్రేషన్ స్టాంపు చూసి నెలలోపు తిరిగి వెళ్లాల్సి ఉంటే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. వీరు ఆధార్ కాపీ, పాస్‌పోర్టులతో దరఖాస్తు చేసుకోవాలి.
అలాగే ఏపీఎన్‌ఆర్‌టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ) ద్వారా రోజుకు రెండు సిఫారసు లేఖలు ఇస్తారు. ఒక్కో లేఖపై ఆరుగురికి ప్రవేశం ఉంటుంది.
- దరఖాస్తు ఎక్కడ?: సుపథం వద్ద
- టికెట్: రూ.300
- దర్శనానికి పట్టే సమయం:సుమారు 3 నుంచి 4 గంటలు.
శ్రీవాణి దర్శనం టికెట్ రూ.10వేలు...
శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు రూ.10 వేల విరాళమిచ్చే వారి నుంచి అదనంగా రూ.500 తీసుకుని టికెట్ ఇచ్చి ఒకరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు.
రోజుకు ఎన్ని టికెట్లు ఇస్తారు?:1,500