ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తలారి చెరువు'లో అగ్గిపాడు ఆచారం- ఆ రోజు ఊరంతా ఖాళీ 'అర్ధరాత్రి దాటాక !'

Different Culture in Anantapur District: ఆధునిక సాంకేతికత ఉన్న ఈ రోజుల్లోనూ తమ గ్రామాన్ని ఓ శాపం వెంటాడుతోందని ఆ గ్రామస్థులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని ఖాళీ చేసి అర్ధరాత్రి దాటాక తిరిగి ఇంటికి వస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ అగ్గిపాడు ఆచారాన్ని తరాలుగా పాటిస్తున్నారు గ్రామస్థులు. ఇంతకీ ఏంటీ అగ్గిపాడు ఆచారం? ఎందుకు పాటిస్తున్నారు? దీని వెనుక అసలు కథేంటి? వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

Different_Culture_in_Anantapur_District
Different_Culture_in_Anantapur_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 1:54 PM IST

Different Culture in Anantapur District: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. ఇంట్లో పొయ్యి వెలగదు, దీపం ముట్టించరు. అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజున గ్రామం మొత్తం ఖాళీ చేసి ఈ అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తారు. గ్రామం శివారులోకి వెళ్లి అర్ధరాత్రి దాటాక తిరిగి గ్రామానికి చేరుకుని ఇల్లు శుభ్రం చేసుకుని, దేవునికి పూజలుచేయటం వందల సంవత్సరాలుగా ఆ గ్రామస్థులు పాటిస్తున్న ఆచారం.

తలారి చెరువులో గ్రామస్థులు చేసే ఈ అగ్గిపాడు సంప్రదాయం గురించి జిల్లాలో తెలియని వారుండరు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున గ్రామంలోని ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి పశువులు, మేకలతో సహా గ్రామ వెలుపల హాజివలి దర్గావద్దకు తరలి వెళ్తారు. అక్కడే వంటావార్పు చేసుకుంటారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారు.

వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్​ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?

శతాబ్దాల క్రితం జరిగిన బ్రాహ్మణ హత్య శాపంగా మారి గ్రామాన్ని వెంటాడుతోందని ఇప్పటికీ ఈ గ్రామస్థులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్థులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. పూర్వం ఓ బ్రాహ్మణుడు బందిపోట్లతో కలిసి గ్రామాన్ని దోచుకుంటున్నాడని భావించిన గ్రామస్థులు అతడిని హత్య చేశారనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది.

ఈ హత్య అనంతరం తలారి చెరువు గ్రామంలో మగ పిల్లలు పుట్టిన వెంటనే చనిపోయేవారట. దీనిపై గ్రామస్థులు అప్పట్లో ఓ మునిని అడగగా బ్రాహ్మణ హత్య కారణంగానే గ్రామంలో మగపిల్లలు బతకడంలేదని, గ్రామం అభివృద్ధి చెందటంలేదని చెప్పారట. దీనికి ప్రాయశ్చిత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజున అగ్గిపాడు ఆచారం పాటిస్తే దోషం పోతుందని గ్రామస్థులకు ముని చెప్పారని ప్రతీతి.

ఈ నేపథ్యంలో ఏడాదిలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు గ్రామంలో ఏ ఇంట్లోనూ పొయ్య వెలిగించరు. దీపం ముట్టించరు. విద్యుత్ దీపం కూడా వెలగకుండా గ్రామం మొత్తం కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. దీన్ని అగ్గిపాడు ఆచారంగా గ్రామస్థులు చెబుతారు. ఈ ఆచారం కొన్ని శతాబ్దాలుగా గ్రామస్థులు పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. తమ పూర్వీకులు చేసిన అపచారంతో అగ్గిపాడు చేస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఈ అగ్గిపాడు ఆచారాన్ని గ్రామస్థులు పాటించారు. శనివారం మాఘశుద్ధ పౌర్ణమి కావటంతో ఉదయమే గ్రామస్థులంతా వంట చేసుకోటానికి అవసరమైన సరుకులను ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై పెట్టుకుని గ్రామం దాటి వెళ్లిపోయారు. వారితో పాటు ఇంట్లో పశువులు, మేకలు వెంటబెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామం నుంచి తరలిపోయారు. గ్రామ శివారులోని హజివలి దర్గా వద్ద చెట్ల కింద ఒకేచోట వంటలు చేసుకుని, అక్కడే భోజనం చేసి అర్ధరాత్రి దాటేవరకు అక్కడే చీకట్లో గడిపారు.

అర్ధరాత్రి తర్వాత పౌర్ణమి ఘడియలు దాటిపోయాక, అందరూ తిరిగి ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకున్నారు. అప్పుడు మళ్లీ గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, దీపాలు వేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని, తలస్నానాలు చేసి దేవునికి పూజలు నిర్వహించారు. ఏడాదికోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా తరాలుగా గ్రామస్థులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

అగ్గిపాడు ఆచారాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలామంది గ్రామస్థుల వద్దకు వస్తుంటారు. మరికొందరు ఆసక్తిగా వీరి ఆచారం గురించి తెలుసుకుంటారు. ఈ ఆచారాన్ని పాటిస్తున్నందునే గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారని తలారిచెరువు గ్రామస్థులు నేటికీ నమ్ముతున్నారు.

ABOUT THE AUTHOR

...view details