Dharani Pending Applications in Telangana :తెలంగాణలో పెండింగ్ భూ సమస్యలు తరగడం లేదు. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ మార్చిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను జూన్ 4లోపు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో వేగం తగ్గడంతోపాటు, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూ శాఖ నిలిపివేసింది.
దీంతో లక్ష దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటికి పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. మరో 1.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసి కోడ్ తొలగిపోయేలోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది.
గతంలో తిరస్కరణలతోనే :రైతులు 2023 అక్టోబరుకు ముందు ధరణి పోర్టల్‌లో చేసుకున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపెడా తిరస్కరించారు. నెలనెలా దరఖాస్తుల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం విధించడంతో ఏ చిన్న లోపం కనిపించినా తిప్పి పంపించారు. పలు సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విచారణల్లో జాప్యం జరిగినా దస్త్రాలు అందుబాటులో లేకపోయినా తిరస్కరించారని రైతులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అన్ని సమస్యలపై దృష్టి పెడుతుండటంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తున్నారు.