DGP Report to CEO about Pinnelli Ramakrishna Reddy EVM Destroy Incident :మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని నివేదికలో పేర్కోన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ పంపిన తాఖీదుకు సీఈఓ సమాధానం ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యే అరెస్టు, కేసుల నమోదు, సిట్ పేర్కొన్న అంశాలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్త కూడా సీఈఓకి వివరణ నివేదికను ఇచ్చారు. ఇందులోని అంశాలను యథాతథంగా ఈసీకి పంపినట్టు తెలుస్తోంది. మాచర్ల ఘటనలో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు పని చేస్తున్నట్టు ఈసీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై వివరణ ఇవ్వాలంటూ భారత ఎన్నికల సంఘం పంపిన తాఖీదుకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు అంశంపై ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్త సీఈఓ మీనాకు నివేదిక పంపారు. పోలింగ్ జరిగిన 13 తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలనాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం ధ్వంసం చేశారని డీజీపీ తన నివేదికలో పేర్కోన్నారు. ఇద్దరు అనుచరులు వై శ్రీనివాసరెడ్డి, జీశ్రీనివాసరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేశారని పేర్కోన్నారు. మే 15 తేదీన నమోదు చేసిన కేసులో పీడీపీపీ చట్టంలోని సెక్షన్లు 448, 427 రెడ్ విత్ 34 కింద అభఇయోగాలు నమోదు చేసినట్టు వెల్లడించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కోంటూ మే 20 తేదీన మరికొన్ని సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 448, 427,353, 452, 12బి రెడ్ విత్ 149 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్పీయాక్టు లోని సెక్షన్ 135,131 కింద కూడా అభియోగాలు మోపినట్టు డీజీపీ వివరించారు.