DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తున్న ఫొటోలు, దృశ్యాలు, అటవీ శాఖ ట్రాప్ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. దీంతో చిరుత కదలికలపై అధికారులు మరింత నిఘా పెంచారు. చిరుత సంచరిస్తున్న శివారు ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిరుత సంచరిస్తున్న దృశ్యాలు : రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారి- 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నోటిలో ఓ జంతువుని పట్టుకోని చిరుత జాతీయ రహదారి దాటుతోందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి, ప్రసారభారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫొటో రికార్డయింది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్థారించారు.
"రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ గోడపై రాత్రి తిరిగినట్టు స్థానికుల నుంచి సమాచారం అందింది. ఇప్పటివరకూ చిరుత కదలికలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వర్షం కురుస్తుండటంవల్ల పాదముద్రలు కూడా చిక్కడం లేదు. అది మగ చిరుతగా గుర్తించాం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాల్లో పడుకోవద్దు. అలాగే ఉదయాన్నే ఒంటరిగా బయటకి రావద్దు. ఇళ్ల వద్ద రాత్రి సమయంలో లైట్లు వేసుకోవాలి." - భరణి, ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో