Development Works & Modernization Delay at Tirupati Railway Station :నిత్యం రద్దీగా ఉండే ఆ రైల్వేస్టేషన్‌లో ఆధునీకరణ, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యానికి ఆమడదూరంలో పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిధులు కేటాయించినా, ప్రయోజనం కనిపించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే శ్రీవారి భక్తులతో కిటకిటలాడే తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి! ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైల్వే స్టేషన్‌కు ఉత్తరం, దక్షిణం వైపు నూతనంగా నిర్మిస్తున్న ప్రవేశద్వారం నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు! రెండేళ్ల క్రితం దాదాపు 300కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ ఆధునీకరణ పనులను దిల్లీకి చెందిన గుత్తేదారు సంస్థకు అప్పగించారు. 2025 ఫిబ్రవరిలోగా, ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా నిర్మాణాలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
'దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోర్, మూడు అంతస్తుల భవనంతోపాటు భూగర్భ పార్కింగ్ నిర్మాణం చేపట్టారు. దిగువ అంతస్తులో రైళ్ల రాక పోకలు, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, రెండో అంతస్తులో కామన్ వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్టు, మరుగుదొడ్లు, క్లాక్ రూమ్, మూడో అంతస్తులో రన్నింగ్ రూమ్, టీటీఈ (TTE) విశ్రాంతి గదులతో పాటు స్టాళ్లు ఏర్పాటు కావాల్సి ఉంది! దక్షిణం వైపు ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా ఉత్తరం వైపు 50 శాతం కూడా పూర్తి కాలేదు.' - వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి