Devaragattu Bunny Utsavam 2024 : దసరా పండగ వచ్చిందే అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు, సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది. కానీ ఆప్రాంతంలో మాత్రం వీటితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. అదే కర్రల సమరం. ఎంతమందికి గాయాలైన, ప్రాణాలు పోయిన లెక్కచేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు అదే కర్నూలు జిల్లా దేవరగట్టు. ఇప్పుడు దసరా పండగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్ధమైంది. ఆ సంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మందికి గాయాలైన, ఆచారాన్ని మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టరు. ఈ సంవత్సరం అయినా హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాలు నిర్వహించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటే ఏమిటి? : కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి దసరా పండగకు ముందు రోజు రాత్రి కర్రల సమరం ఏళ్ల తరబడి జరుగుతోంది. దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పండుగన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తుండటం ఆనవాయితీ.
కల్యాణం అనంతరం కొండ పరిసరాల్లోని ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం వాటి ఎదురుగా ఉన్న బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్థులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.