ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​ - PAWAN KALYAN INSPECTS KAKINADA PORT

పీడీఎస్ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తనిఖీలు - 1064 టన్నుల బియ్యం సంచులను పరిశీలించిన పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల

Pawan Kalyan Inspects Kakinada Port
Pawan Kalyan Inspects Kakinada Port (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 3:26 PM IST

Updated : Nov 29, 2024, 8:29 PM IST

PAWAN KALYAN INSPECTS KAKINADA PORT: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ కల్యాణ్​ పరిశీలించారు. పవన్‌ కల్యాణ్​, నాదెండ్ల మనోహర్ పోర్టు నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబుని పవన్ కల్యాణ్​ నిలదీశారు.

కాకినాడ పోర్టులో 1064 టన్నుల బియ్యం సంచులను పవన్‌ కల్యాణ్, మంత్రి నాదెండ్ల పరిశీలించారు. ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని వాటిని అధికారులు పోర్టులోనే ఉంచారు. అదే విధంగా 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్​లో 640 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా స్టెల్లా ఎల్ పనామా షిప్​లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం సంచులను స్వయంగా బోటులో సముద్రంలోకి వెళ్లి పవన్‌ కల్యాణ్ పరిశీలించారు.

భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగానీ మీరు ఆపలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం తరలిస్తున్నవారు ఎంతవారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రేషన్ మాఫియా గ్యాంగ్​వార్ - ఆధిపత్యం కోసం పరస్పరం కార్లతో ఢీ - Ration Mafia Gang War in Tiruvuru

Pawan Kalyan Media Conference: తనిఖీల అనంతరం పవన్ కల్యాణ్​, మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత అయిదేళ్లలో కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారని, తాము వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామన్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు వెయ్యి లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారని తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బియ్యం అక్రమ రవాణాను గతంలో డ్రోన్‌ ద్వారా చిత్రీకరించామని పవన్ కల్యాణ్​ అన్నారు.

పోర్టు అధికారులు సహకరించలేదు:కాకినాడ పోర్టు నుంచి సరకుల ఎగుమతులు జరగాలని, అక్రమాలు జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారులు తనకు కూడా సహకరించలేదని, బియ్యం అక్రమ రవాణాపై డీప్‌ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆరోపించారు. బియ్యాన్ని కొన్ని దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని పవన్ తెలిపారు. మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నామన్న పవన్, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం అక్రమ రవాణాలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో అక్రమ వ్యాపారం జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

పీడీఎఫ్​ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్

కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా: కాకినాడ పోర్టు అధికారులు కూడా సరిగా సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికి సముద్రతీరం చాలా లాభదాయకమని పవన్ అన్నారు. సముద్రతీరం ఎంత లాభమో, అంత నష్టం కూడా ఉందని, మన తీరప్రాంతాల్లో మారిటైమ్‌ భద్రత సరిగా లేదని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలన్న పవన్, కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోందని వెల్లడించారు. రేషన్ బియ్యం వేలమందికి ఉపాధిగా మారిందని, కోర్టులకు వెళ్లి తన పైనే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.

వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు: కిలో రేషన్ బియ్యాన్ని రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని పవన్ అన్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలు, అవినీతిని అరికడతామన్న పవన్, పారదర్శక పాలన అందిస్తామని ప్రజలకు మాటిచ్చామని గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, సీఐడీ, సీబీఐ, ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామని స్పష్టం చేశారు. కాకినాడ యాంకర్‌ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని, ఓడలోకి వెళ్లకుండా తననే అడ్డుకున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందని అన్నారు.

ఈ ఎగుమతులు సక్రమంగా జరిగితే రాష్ట్ర ఖజానాకు డబ్బు వచ్చేదని, రేషన్‌ బియ్యం నిల్వలపై ప్రతి జిల్లాలో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ఎగుమతులు ఆపితే కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని అంటున్నారని, తనిఖీలకు వెళ్లకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టులో 10 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారని అంటున్నారని, కార్మికులు ఉపాధి కోల్పోకుండా చూడటం ఎలా అని ఆలోచిస్తున్నామని అన్నారు.

విదేశాలకు అక్రమంగా పీడీఎస్​ బియ్యం - 640 టన్నులు సీజ్ చేసిన కాకినాడ కలెక్టర్‌

Last Updated : Nov 29, 2024, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details