Deputy CM Pawan Kalyan Field Visit To Sajjala Estate : వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తేలుస్తానని ఆయన ప్రకటించారు. పవన్ ప్రకటనతో జిల్లా అధికారులు, వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.
YSR జిల్లా సీకేదిన్నె మండలంలోని సర్వే నెంబర్ 1629లో 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 184 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఆ భూముల్లో ఎస్టేట్ నిర్మించి చుట్టూ పెద్దపెద్ద గేట్లు వేసి కంచె నిర్మించారు. ఎస్టేట్ భూముల్లో 42 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పది రోజుల కిందట పవన్ కల్యాణ్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆదేశించారు. ఆరోజు నుంచి అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు సర్వే చేస్తున్నా కొలిక్కిరాలేదు. పరస్పర ఫిర్యాదులతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
అడవిని కలిపేసుకున్న 'సజ్జల ఎస్టేట్' - విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
స్వయంగా రంగంలోకి దిగుతున్న పవన్ కల్యాణ్: సజ్జల ఎస్టేట్‌లో 42 నుంచి 52 ఎకరాల భూమి అటవీ శాఖదని రెవిన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నా అటవీశాఖ అధికారులు తమది కాదని సరైన మ్యాపులు, డాక్యుమెంట్లు లేవంటున్నారు. అటవీ సిబ్బంది సర్వే పేరుతో ముందుకు వెళ్లినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో తప్పించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కొలిక్కి రానందున స్వయంగా జాయింట్ కలెక్టర్ ఆదితిసింగ్ రంగంలోకి దిగి సజ్జల ఎస్టేట్ భూములను పరిశీలించారు.