Deputy CM Bhatti On Electricity Job notification :విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912కు ఫోన్ చేయాలని కోరారు. ఇటీవల వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టామని వివరించారు. వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేస్తామన్న డిప్యూటీ సీఎం, దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల హరిత విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం అవసరమైన బడ్జెట్ను తయారు చేసుకుని ప్రణాళిక చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన, సంపూర్ణ విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు పంటతోపాటు పవర్ ద్వారా ఆదాయం వచ్చేలా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విద్యుత్తు శాఖ ప్రధాన పాత్ర అన్నారు.
విద్యుత్తు అధికారులు పొలంబాట పట్టి రైతుల సమస్యలను పరిష్కరించాలి : గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చామని గుర్తు చేశారు. సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. విద్యుత్తు అధికారులు పొలం బాట పట్టి రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. విద్యుత్తు తీగలు, విరిగిన, వంగిపోయిన స్తంభాలకు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో గత పాలకులు బినామీల పేరిట భూములు బదలాయించారన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకునే వారని, మంత్రివర్గంలో ఇతరులకు మాట్లాడే అవకాశం ఉండేది కాదన్నారు. అందుకే మూసీ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించారా అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు.