Deaf and Dumb Cricket Players:క్రికెట్.. భారతీయులకు పరిచయం అవసరం లేని క్రీడ. అలాంటి ఆటలో ఔరా అనిపిస్తున్నారు ఈ క్రీడాకారులు. వీరికున్న ప్రతికూల ప్రభావంతో తోటి మిత్రులే కలసి ఆడలేదు. తెలిసిన వాళ్లే మీరేం అడతారని హేళనలు చేసిన ప్రతిసారీ సాధించాలనే పట్టుదల పెరిగింది. తామేందుకు క్రికెట్ ఆడకూడదని బలంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ పంతమే వీరిని రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించేలా చేసింది.
పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన రఘుకి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. మాటలు కూడా రావు. తండ్రి శ్రీనివాసరాజు లారీ డ్రైవర్. ఎలాగోలా కష్టపడి చదువుకుందాం అంటే తోటి విద్యార్థుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు రఘు. దాంతో తిరుపతి దేవస్థానం వారి ప్రత్యేక పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ ఆసక్తిని గమనించి స్కూల్ జట్టులోకి రఘును తీసుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబడుతూ ప్రతి మ్యాచ్‌లో రాణించాడు. ఏకంగా రాష్ట్రస్థాయి బధిరుల జట్టుకి ఎంపికయ్యాడు.
అయితే ఇతర రాష్ట్రాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లడానికి సైతం డబ్బులు లేకపోవడంతో విజయవాడలోని ఓ వస్త్ర దుకాణంలో రఘు క్యాషియర్‌గా చేరాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే తెల్లవారుజామున సాధన చేసేవాడు. మరోవైపు డిగ్రీ పూర్తి చేశాడు. స్థానిక మ్యాచ్‌లలో గెల్చుకున్న పారితోషికాలు దాచుకొని తెలంగాణలో జరిగిన బధిరుల క్రికెట్ పోటీలకు వెళ్లాడు. అక్కడ బౌలింగ్‌లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో నిర్వాహకులు ఆంధ్రా తరఫున ప్రత్యేక రంజీ పోటీలకు ఎంపిక చేశారు.
అలా 2017లో 22 ఏళ్లకే రాష్ట్ర జట్టుకి ఎంపికవడమే కాదు.. కెప్టెన్ కూడా అయ్యాడు. అదే ఏడాది అనంతపురంలో జరిగిన ఏపీ టీ-20 ఛాంపియన్‌షిప్ ఫర్ డెఫ్ క్రికెట్ పోటీల్లో ఫీల్డింగ్ చేస్తూ కిందపడటంతో రఘుకి కుడి చేయి విరిగింది. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, నెలకే కోలుకొని మళ్లీ జట్టులోకి వెళ్లాడు. ముంబయి, దిల్లీ, కోల్కత్తా, బెంగళూరు సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో ఆడిన రఘు.. ఐదుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఐసీడీఏ టీ-20 మ్యాచ్‌లో ఏపీ తరఫున బౌలింగ్‌లో నాలుగోవర్లు వేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. రఘు ఇప్పటివరకు 20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించి 13 మ్యాచ్‌ల్ని విజయపథంలో నిలిపాడు.
మరోవైపు బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్నాడు సిలివేరు వేణు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పక్కన ఉన్న బొప్పూడి గ్రామానికి చెందిన అతడిని చిన్నతనంలో తండ్రి స్థానిక పాఠశాలలో చేర్పించడానికి వెళ్తే ఉపాధ్యాయులు మీ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు, అతడికి పాఠాలు చెప్పడం మావల్ల కాదని తేల్చిచెప్పారు. వేణు తల్లిదండ్రులు గ్రామంలోనే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని దానిపై వచ్చే ఆదాయంతో ముగ్గురు సంతానాన్ని పోషిస్తున్నారు.