Cyber Fraud by APK File in Hyderabad :మీ ఇల్లు మూసీ రివర్ బెడ్లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయండి. మీకు రుణమాఫీ ఆయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలా మీకు వాట్సాప్ లో వచ్చిన సందేశాల ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేశారా ? అయితే మీ మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయినట్లే. ఫోన్లో ఇన్‌స్టాల్ అయిన మాల్వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ ఖాతాలో నగదును కాజేస్తారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడికి ఈ విధంగా సందేశం వచ్చింది.
'మీ బ్యాంక్ ఖాతా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకు బ్లాక్ అవుతుంది. దయచేసి మీ పాన్‌కార్డును అప్డేట్ చేసుకోండి. దీని కోసం మీకు వచ్చిన మెసేజ్లోని బ్యాంకు ఏపీకే అప్లికేషన్‌కు క్లిక్ చేయండి' అని వాట్సప్‌కు ఓ బ్యాంకు లోగో డీపీగా ఉన్న నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. బాధితుడి వెంటనే లింక్‌ను క్లిక్ చేయగానే ఫోన్ సాఫ్ట్వేర్ అలర్ట్ వచ్చింది. దీంతో వెంటనే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేశాడు. జరిగిందంతా తన స్నేహితులతో చెప్పి ఫోన్‌ను ఫార్మాట్ చేశాడు. నగరానికి చెందిన మరో ప్రైవేట్ ఉద్యోగికి సైతం కస్టమర్ సపోర్ట్ పేరుతో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వాట్సప్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో యాప్ ఇన్‌స్టాల్ చేయగానే అతని పేరుపై ఈసిమ్ యాక్టివేట్ అయిందని సందేశం వచ్చింది.