Dummy Messages Cyber Crimes in Hyderabad : సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, కొందరు సైబర్ మోసగాళ్ల బారినపడి సంపాదనను సమర్పించేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కొరియర్, బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేశామంటూ నిత్యం జనాలకు వేల సంఖ్యలో కాల్స్ వస్తాయి. వీటిని నమ్మి మోసపోతున్న సైబర్ బాధితులు ఎంతో మంది ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్ చేసి కంపెనీలో సహోద్యోగినని, తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా మిత్రుడు ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి డబ్బు పంపిస్తాడని చెప్పి రూ.3.50 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ రూ.3.50 లక్షలు తిరిగి పంపాడు. మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా, ఆ డబ్బు జమవ్వలేదని తేలింది. ఆరా తీయగా సందేశాలు నకిలీవని అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి లబోదిబోమన్నాడు. ఇలా ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా, సైబర్ వంచకులు అందిన కాడికి దర్జాగా దోచేస్తున్నారు.
డమ్మీ సందేశంతో జర భద్రం : ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. సహోద్యోగి, క్లాస్‌మెట్‌గా పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు రూ.10 వేలు లేదా ఎంతో కొంత పంపించినట్లు అచ్చం బ్యాంకు తరహా సందేశం పంపిస్తారు. ఈ తరహా మోసంలో డబ్బు క్రెడిట్ అయినట్లు బ్యాంకు పేరుతో సందేశం వచ్చినా, వాస్తవంగా ఖాతాలో జమ అవ్వదు. నేరగాళ్లు అవతలి వ్యక్తుల్ని బోల్తా కొట్టించడానికి డమ్మీ సందేశం పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల ఇలాంటి ఎస్ఎమ్ఎస్లను చూసి నిజంగానే డబ్బు జమైందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.