Cyber Crimes In Vijayawada : విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక వైద్యురాలు రూ.3లక్షలు పెట్టుబడులు పెట్టారు. ఆమెకు రూ.4లక్షల వరకు వచ్చాయి. మరో రూ.1.75లక్షలు రావాల్సి ఉంది. ఈ లోగా హరియాణా పోలీసులు ఆమె ఖాతాను ఫ్రీజ్ చేశారు. కారణం ఆమె పెట్టుబడులు పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు కొంత మంది నుంచి పొందారు. మోసపోయిన వారు కేసు పెట్టారు. హరియాణా పోలీసుల దర్యాప్తులో నగదు విజయవాడ వైద్యురాలి ఖాతాకు వచ్చాయని తేలింది. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఈ తరహా కేసులు వస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
- నగరానికి చెందిన ఓ వ్యక్తి చిరు ఉద్యోగి. టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్ చూసి ఒక సంస్థలో రూ.1000 పెట్టుబడులు పెట్టారు. అతనికి రూ.3000 ఆదాయం వచ్చింది. తర్వాత మరో రూ.5వేలు పెడితే రూ.20 వేల ఆదాయం వచ్చింది. తర్వాత రూ.10లక్షలు పెట్టుబడులు పెడితే పైసా తిరిగి రాలేదు.
- ‘పెట్టుబడులు పెట్టండి ఆకర్షణీయమైన ఆదాయం పొందండి’అనే ప్రకటనను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వాట్సాప్‌లో చూశారు. రూ.100 పంపిస్తే రూ.1000 వచ్చింది. మరోసారి రూ.3వేలు పంపించగా రూ.10వేలు ఆదాయం వచ్చింది. విడతల వారీగా రూ.5 లక్షలు పంపితే నిలువునా మోసపోయారు.
ఈ రెండు కేసుల్లోని వ్యక్తులు బాధితులే. రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ సైబర్ క్రైం పోలీసుల విచారణలో వీరిద్దరూ నిందితులని తేలింది. అదేంటి డబ్బులు పోగొట్టుకుంటే నిందితులు ఎలా అవుతారని అనుకుంటున్నారా? సైబర్ నేరగాళ్లు వినూత్నంగా వీరిద్దరిని నిందితులుగా మార్చేశారు. సైబర్ నేరగాళ్లు పెట్టుబడులు పెట్టించిన ఇద్దరితోనూ ఒకరికి తెలియకుండా మరొకరికి వాళ్లతోనే డబ్బులు పంపించేలా చేశారు. పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడులను మాత్రం నేరగాళ్ల ఖాతాలకు మళ్లించుకున్నారు.
బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే దర్యాప్తులో చిరుద్యోగి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఖాతాలకు డబ్బులు వెళ్లాయని తేలుతుంది. వారి ఖాతాలను బ్యాంకర్లు సీజ్ చేస్తారు. మోసాలకు పాల్పడ్డారని వారిద్దరిపైనే కేసులు నమోదు చేస్తారు. తాము ఆదాయం వస్తుందన్న ఆశతో పెట్టుబడులు పెట్టామని చెప్పినా ఉపయోగం ఉండదు.