Cyber Crimes in AP :చిటికెలో లక్షలు రూపాయలు సంపాదించేద్దాం అని అరాటపడే ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లకు చాలా తేలికగా చిక్కుతున్నారు. గతంలో నిరాక్షరాస్యత, అజాగ్రత్తల వల్ల సైబర్ మోసాల బారిన పడేవారు అధికం. నేటి కాలంలో ఉన్నత చదువులు చదివిన యువత, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల సొమ్ములన్నీ ఖాళీ చేస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ కేసుల్లో అత్యధికంగా విశాఖ వాసులు ఉండటం గమనార్హం.
ఇంకా రూ.13కోట్లు అక్కడే:సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని తెలిశాక వెంటనే సైబర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగంలోకి దిగుతారు. మాయగాళ్లు ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తీసేసేలోపు (గోల్డెన్ అవర్) ఫ్రీజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ నగదు చెల్లించాలంటూ బీఎన్‌ఎస్‌ఎస్ (BNSS) సెక్షన్లు 497, 503 కింద కోర్టులో దరఖాస్తు చేసుకుంటే పోలీసు, న్యాయ, ఆర్థిక రంగాల సమన్వయంతో డబ్బు తిరిగి పొందవచ్చు. సైబర్ నేరాల గణాంకాల(Cyber crime statistics) ప్రకారం విశాఖలో రూ.18 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయింది. తొలి విడతగా ఇటీవల రూ.4.65 కోట్లు బాధితులకు అధికారులు తిరిగి ఇచ్చారు. ఇంకా రూ.13 కోట్లకు పైగా అందించాల్సి ఉంది.
పెళ్లి పేరుతో యువతి ఘరానా మోసం - రూ.28 లక్షల టోకరా - Cyber Crimes in AP
సైబర్ మోసానికి గురైన వ్యక్తి గోల్డెన్ అవర్‌లోనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. లేదా(www.cyber crime statistics.gov.in) లో ఫిర్యాదు చేయాలి. తద్వారా బ్యాంకు అకౌంట్ లో నగదును ఫ్రీజ్ చేయటానికి అవకాశం ఉంటుంది-ఫక్కీరప్ప, విశాఖ జాయింట్ కమీషనర్
అవగాహనకు: సైబర్ నేరాలపై డాక్యుమెంటరీని విశాఖ పోలీసులు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సైబర్ క్రైంలు జరిగాయి? ఎన్ని విధాలుగా ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్నారు. దీనిని మరో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రతి గ్రామంలో, థియేటర్లలో, వాణిజ్య సముదాయాల్లో బస్‌స్టాండ్లలో ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.