CPM 27TH STATE MAHASABHALU: ఫిబ్రవరి ఒకటి నుంచి నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మహాసభల సన్నాహక సమావేశం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో: దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. 45 సంవత్సరాల తర్వాత మరోసారి సీపీఎం మహాసభలకు నెల్లూరు ఆతిథ్యమిస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో నెల్లూరు ముందుందని శ్రీనివాసరావు అన్నారు. మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి పతాక యాత్రలు కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, కడప ఉక్కు, అమరావతి రాజధాని, నంద్యాల రెన్యుబుల్ ఎనర్జీకి భూముల పందేరంపై యాత్రలు కొనసాగుతాయని అన్నారు.