ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తలోనూ వైఎస్సార్సీపీ అవినీతి - రూ.200 కోట్లు స్వాహా!

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో అవినీతి - నిబంధనలు పాటించకుండా రివర్స్‌ టెండరింగ్‌లో అప్పగింత

By ETV Bharat Andhra Pradesh Team

Published : 8 hours ago

CORRUPTION_IN_SWACHHANDRA
CORRUPTION_IN_SWACHHANDRA (ETV Bharat)

Swachha Andhra Corporation Scam : చెత్త నుంచి సంపద సృష్టించడం దీన్ని వైఎస్సార్సీపీ నేతలు మరోలా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. చెత్త నుంచి కూడా సంపాదించుకోవచ్చని అన్వయించుకున్నారు. ఆ ఫలితమే చెత్త సేకరణ, తరలింపు పేరిట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రూ.200 కోట్లు దండుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో అవినీతి : నవ్యాంధ్రలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2014-2019 మధ్య కాలంలో దాదాపు 20 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసి పట్టణ, స్థానిక సంస్థల్లో పనులు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం రెండు సంస్థలకు మాత్రమే పనులు కట్టబెట్టారు. చిలకలూరిపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేత జాన్‌ సైదా టెండర్లు వేయగా అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్‌ హయాంలో కీలకంగా ఉన్న మహిళా ఐఏఎస్​ అధికారి పూర్తిస్థాయిలో ఈ టెండర్ల విషయంలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రివర్స్‌ టెండరింగ్‌లో రెండు సంస్థలు మాత్రమే పాల్గొనేలా వీరిద్దరూ చక్రం తప్పారు. ఫోర్జరీ సాల్వెన్సీ సర్టిఫికెట్లతో పాల్గొని అధిక ధరలకు సదరు సంస్థలు టెండర్లు దక్కించుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్లతో సంబంధం లేకుండానే ఒప్పందాలు జరిగిపోయాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ రూ.570 కోట్ల విలువైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ పనులను అర్హతలేని సంస్థలకు అప్పగించారు. కాంట్రాక్టు సంస్థలకు ఎలాంటి ఆస్తులు, బ్యాంకు సాల్వెన్సీలు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారు.

నాసిరకం సామగ్రి అందజేత : టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులైనా సక్రమంగా చేశారా అంటే అదీలేదు. రూ.20 కోట్ల విలువైన 1100 లీటర్ల కాంపాక్ట్‌ బిన్‌లను సరఫరా చేయడానికి టెండర్‌ దక్కించుకుని నాసిరకం ఐరన్‌ బిన్‌లను సరఫరా చేసి బిల్లులు కాజేశారు. అలాగే రూ.100 కోట్ల విలువైన ట్రై సైకిళ్లు, 40 లీటర్ల హెచ్‌డీపీఈ బిన్‌లు సరఫరా చేసే కాంట్రాక్టులో అన్నీ నాసిరకం సరఫరా చేసి నిధులు సొమ్ము చేసుకున్నారు. రూ.120 కోట్ల విలువైన 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 1.50 కోట్ల హెచ్‌డీపీఈ డస్ట్‌బిన్‌లు సరఫరా కాంట్రాక్టులోనూ ఇదే తీరుతో వ్యవహరించారు. ఇప్పటికే రూ.60 కోట్లు డ్రా చేశారు. మరో రూ.10 కోట్లు డ్రా చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

నాలుగు జిల్లాల పరిధిలో 2,200 గ్రామ పంచాయతీలకు రూ.74 కోట్ల విలువైన ట్రాక్టర్ ట్రాలీలు సరఫరా చేసేందుకు గుత్తేదారు సంస్థలు టెండరు దక్కించుకున్నాయి. 2023 మే 8న వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. 180 రోజుల్లో సరఫరా చేయాల్సి ఉండగా, 17 నెలలు పూర్తయినా ఇంత వరకు ఒక్కటి కూడా సరఫరా చేయలేదు. మంగళగిరి, తాడేపల్లిలో 2.29 లక్షల టన్నుల చెత్త నుంచి ఘన వ్యర్థ పదార్థాలను వేరు చేయడానికి టన్నుకు రూ.747 చొప్పున ప్రభుత్వం రూ 17.09 కోట్లు చెల్లించింది. కానీ పనులు మాత్రం జరగలేదు. గడిచిన ఐదేళ్లలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా రూ.570 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.200 కోట్లు దోచేశారని మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్యమంత్రికి, విజిలెన్స్ డిజీకి ఫిర్యాదు చేశారు.

విజిలెన్స్ విచారణకు ఆదేశం : స్వచ్ఛంధ్ర కార్పొరేషన్‌లో అవినీతిపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. గుంటూరు, పల్నాడు, విశాఖపట్నం, కడప జిల్లాల్లో కాంట్రాక్టు పొందిన సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వైఎస్సార్సీపీ నేతలు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఏకంగా బ్యాంకు సాల్వెన్సీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించకుండానే పనులు చేపట్టాయి. కొన్నిచోట్ల అగ్రిమెంట్‌ కాలం పూర్తయినా గడువు పెంచుకుని చలామణి అవుతున్నాయి.

సరైన కారణం లేకుండానే వాటికి అనేక మినహాయింపులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థలకు ఆర్థిక స్థోమత లేని కారణంగా పనులు పూర్తి చేయలేక, సామగ్రి సరఫరా చేయలేక చేతులెత్తేశాయి. ఫలితంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు ప్రక్రియ సరిగా జరగటం లేదు. చాలా చోట్ల చెత్త కొండల్లా పేరుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జరిపిన సమిక్షలోనూ చెత్తడంప్​లపైనా విమర్శించారు. గుత్తేదారు సంస్థలు చెత్తను తరలించకుండా రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మార్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు అధికారులు పాత గుత్తేదారు సంస్థలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత లేని ఆ సంస్థలను కొనసాగించేలా, చేయని పనులకూ బిల్లులు చెల్లించేలా కమిషనర్లపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

వైఎస్సార్సీపీ హయాంలో 'చెత్త' ప్రాజెక్టుకు తూట్లు - పనులు చేయకుండానే బిల్లులు - People Suffering to Dumping yard

రాష్ట్ర ప్రజలకు గుడ్​న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP

ABOUT THE AUTHOR

...view details