Incomplete PHC In Vijayawada :ఆసుపత్రిని నిర్మించాలనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. 14 ఏళ్ల కిందటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసినప్పటికీ నేటికీ సైతం ఇటుక పడక అనేది కల గానే మిగిలిపోతోంది. వేలాది మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో వైద్యశాల లేక అవస్థలు పడుతున్నారు. చిన్న సుస్తీ చేసినా సుదూరాన ఉన్న హాస్పిటల్‌కు పరుగులు పెడుతున్నారు.
ప్రతిపాదనలకే తప్ప ప్రారంభానికి నోచుకోలేదు:విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్ ప్రాంతంలో ఆరోగ్య కేంద్ర నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి అప్పటి మేయర్ రత్నబిందు శంకుస్థాపన చేశారు. నేటికి 14 ఏళ్లు పూర్తయినా దానికి పునాదులు కూడా పడలేదు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ కాలనీలో నివాసముంటారు. పేరు గొప్ప ఉరు దిబ్బ అనే రీతిగా పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాథమిక వైద్యానికి సైతం వ్యయప్రయాసలకోర్చి కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ సాధారణ వైద్యశాల వద్దకు వెళ్లాల్సిన క్లిష్ట పరిస్థితి వస్తోందని ప్రజలు తమ గోడును వెళ్లగక్కుతున్నారు.
ఆసుపత్రి కోసం ప్రజల ఎదురుచూపులు: పీహెచ్‌సీ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. అందుకు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి చుట్టూ ప్రహరీ నిర్మించడంతో స్థలం కబ్జాకు గురికాలేదు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా నిరుపయోగంగా మారింది. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులు తప్ప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలకు వైద్య కష్టాలు తప్పడం లేదు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఆటో ఛార్జీలు, వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. అదే ఇక్కడ ఆస్పత్రి పూర్తి చేస్తే మందులు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.