Telangana Budget 2024-25: రాష్ట్ర పూర్తి బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఈ నెల 25 వ తేదీన ఉభయసభల ముందుకు రానుంది. ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. 2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కాస్తా అటూ ఇటుగా పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
పూర్తి స్థాయి బడ్జెట్ : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి బడ్జెట్‌ను ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం, బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆర్థికశాఖ ఇప్పటికే కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు తీసుకుని, వాటిపై కసరత్తు పూర్తి చేసింది.
ఇప్పటికే అన్ని శాఖలతో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించి దాదాపు స్పష్టత ఇవ్వగా, వాటి ఆధారంగా ఆయా శాఖల పద్దులు ఉండనున్నాయి. బడ్జెట్‌లోని నిర్వహణా పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా, ప్రగతి పద్దులో మాత్రమే కొంత మేరకు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు.
బడ్జెట్ 2024లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా? పాత Vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెటర్? - Decoding Income Tax Slabs 2024
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనంతరం స్పష్టత : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేపథ్యంలో కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత స్పష్టత రానుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి మాత్రమే కొంత అంచనాలు మారవచ్చని భావిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనంతరం మరింత స్పష్టత రానుంది. అందుకనుగుణంగా కేటాయింపులు చేయనున్నారు.
ఆరు గ్యారంటీలకు : గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌లో ఆరు గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం, విధివిధానాల రూపకల్పన పూర్తైన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు వివరించింది. రైతు భరోసా పథకానికి 15వేల కోట్ల రూపాయలు కేటాయించగా, చేయూత పథకం కింద పింఛన్ల కోసం 14వేల 800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం బడ్జెట్‌లో 7వేల 740 కోట్లు కేటాయించగా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థికసాయం కోసం 7వేల 230 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 4వేల 84 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం 2వేల 418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి వెయ్యి 65 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్ లో 723 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. కొత్త ఉద్యోగ నియామకాల కోసం వెయ్యి కోట్లు కేటాయించింది.
వాళ్లందరూ ఫైనాన్స్ మినిస్టర్లే - పాపం ఒక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ రాలే! ఎందుకో తెలుసా? - Union Budget Interesting Facts
రుణమాఫీ కోసం 31 వేలకోట్లు : రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ సమయంలో బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం 31 వేలకోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఇప్పటికే లక్ష వరకు రుణాలకు సంబంధించి 6వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే మాఫీ చేశారు. నెలాఖరులో లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
ఇతర కార్యక్రమాలకు : మరోవైపు, రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ కొనసాగిస్తోంది. అధ్యయనం అనంతరం అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారెంటీల అమలుతో పాటు ఇటీవల ఇచ్చిన హామీలు, సర్కార్ చేపట్టిన చర్యలకు తగ్గట్లుగా పూర్తి స్థాయి బడ్జెట్ పద్దు సిద్ధం కానుంది. మూసీ నదీ ప్రక్షాళన, అభివృద్ధి, మెట్రో రైల్ పొడిగింపు, స్కిల్ యూనివర్శిటీ తదితర కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు.
పూర్తి స్థాయి బడ్జెట్‌లో శాఖల వారీగా : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో నెల పూర్తి కావస్తోంది. మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం, ఇతరత్రా నిధులు, కేంద్ర నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు, నిధులను పరిగణనలోకి తీసుకొని పద్దు ఖరారు చేయనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పద్దును 2లక్షలా 75వేల 890 కోట్లుగా ప్రతిపాదించారు. పూర్తి స్థాయి బడ్జెట్ పద్దు కూడా కాస్త అటూ ఇటుగా ఉండవచ్చని భావిస్తున్నారు. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కలు 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో శాఖల వారీ పద్దులు లేవు. పూర్తి స్థాయి బడ్జెట్‌లో శాఖల వారీ పద్దులు కూడా ఉండనున్నాయి.
ఈ నెల 25న తెలంగాణ బడ్జెట్ - పద్దును ప్రవేశపెట్టనున్న భట్టి - Telangana Budget Sessions 2024