Comprehensive Family Survey in Telangana:తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఈ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఎటువంటి సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో వస్తున్నాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ కింద ఇచ్చే సమాచారం.
సర్వే నిర్వహణ ఇలా:సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 పార్టులు అంటే పార్టు-1, పార్టు-2గా ఉండి 8 పేజీల్లో సమాచారం పూరించనున్నారు.
- పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడగనున్నారు.
- పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో 7 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, భూముల వివరాలు చెప్పాల్సిందే :భూ వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల రకాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం అనగా నీటి వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
బోటు షికారు - వింటర్లో మంచి థ్రిల్ ఇచ్చే టూర్
రిజర్వేషన్ పొందేవారు:విద్యా, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ విధానంతో ప్రయోజనం పొందినా, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాలు, ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్ల్యూఎస్ ధ్రువపత్రాలు పొందారా? అనేవి నమోదు చేస్తారు.
రాజకీయ నేపథ్యం:ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం, పూర్వం ఏ పదవిలో ఉన్నారనేది తెలుసుకుంటారు. పదవీ కాలం, నామినేటెడ్ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి:ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.