Collectors Conference Will be held at Secretariat on August 5th : ఈ నెల 5 తేదీన సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్లతో పాటు మంత్రులు, కార్యదర్శులు హాజరుకానున్నారు. ఆగస్టు 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబందించి సచివాలయంలో ఏర్పాట్లను రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా సమీక్షించారు. ఇందులో సీసీఎల్ఏ జయలక్ష్మి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, సాధారణ పరిపాలన శాఖ అధికారులు హాజరైయ్యారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ సిసోడియా ఆదేశించారు.
ఆ అంశాలపై ప్రత్యేక దృష్టి:శాఖల వారీగా సమీక్షలతో పాటు గత ప్రభుత్వ హయంలో జిల్లాల్లో భూములు, గనులు ఇసుక, సహజ వనరుల దోపిడీ పైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆయా అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్ల , ఎస్పీలతో జిల్లాల్లో శాంతి భద్రతలు, గంజాయి సాగు, అమ్మకాలపై కట్టడి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.