ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి లోకేశ్‌ కృషితో విశాఖలో గూగుల్‌ క్యాంపస్ - రాష్ట్రాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ అవుతుంది : సీఎం చంద్రబాబు - AP COLLECTORS CONFERENCE

ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్న సీఎం - చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం మన అదృష్టమన్న పవన్ కల్యాణ్

AP Collectors Conference
AP Collectors Conference (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 1:01 PM IST

Collectors Conference in Amaravati :అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ముగిసింది. విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని, వాటిని వెతుక్కోవడమే నాయకత్వం అవుతుందని చెప్పారు. సాధారణంగా ఈ తరహా సదస్సుల్లో విజన్ గురించి ప్రస్తావించి దాన్ని సాధించేందుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.

గూగుల్​తో ఒప్పందం :ఇటీవల ఐటీ మంత్రి లోకేశ్​ అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, దాని ఫలితమే విశాఖలో ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖకు గూగుల్ లాంటి సంస్థలు వస్తే అది గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​లో సంస్థలు ఏర్పాటైతే ఓ దిక్చూచిగా ఏపీ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఐటీ, నిన్న మొన్నా ఏఐ, ఇప్పుడు డీప్ టెక్ అనే సాంకేతికత గురించి మాట్లాడుకుంటున్నామన్నారు.

రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చటం, స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణలు రూపొందించాలని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌరసేవల్ని సులభంగా అందించేలా గూగుల్​తో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులనూ దారి మళ్లించారని ఆరోపించారు. నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చామని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని, అమరావతి కోసం ఇప్పటికే రూ.31 వేల కోట్లు సేకరించామని తెలిపారు.

సంక్రాంతి నాటికి ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు :2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. 3 నెలలకు కలిపి ఒకేసారి పింఛన్‌ ఇచ్చేలా విధానం తెచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని, ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీపం-2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని, వచ్చే సంవత్సరం స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 60% పైగా భూసమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదని సూచించారు. 90% సమస్యలు ఐదారు శాఖల్లోనే ఉన్నాయని, సంక్రాంతి నాటికి ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదని ఆదేశించారు. వచ్చే 20 సంవత్సరాలల్లో 15 % వృద్ధి రావాలని తెలిపారు.

సాంకేతికత అందిపుచ్చుకోవాలి - తక్కువ సమయంలోనే ఎక్కువ సేవలు అందించాలి : సీఎం చంద్రబాబు

సంపదతో మళ్లీ అభివృద్ధి సాధ్యం :మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సు సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉందన్న చంద్రబాబు ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని, ప్రజలు స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్థితిలో ఇప్పుడు ఉన్నారని చెప్పారు. నవ్వుతూ ఆహ్వానిస్తున్నప్పటికీ, హెచ్చరికలూ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. గతంలో నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంటే ఇప్పుడు పెన్షనర్లకూ మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వగలుగుతున్నామన్నారు.

తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టప్రకారం శిక్షించాల్సిందే అని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని, అప్పుడే పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే జిల్లాల మధ్య కలెక్టర్లు కూడా పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుందని, సంపదతో మళ్లీ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం మన అదృష్టం :పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలని, అందుకు ఐఏఎస్​లే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మూలాలనే పెకలించేసి భారీగా అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. ప్రజలు మన అందరిపైనా బృహత్తర బాధ్యత పెట్టారని, పాలకులుగా తాము తీసుకొచ్చిన పాలసీలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్​లే అని వివరించారు.

గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు ఇసుక అక్రమాల వరకూ ఎన్నో పనులు చేయించారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇంతమంది ఐఏఎస్​లు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని, ఇంతటి సంక్షోభంలోనూ సమర్ధ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని చెప్పారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో పని చేయడం మన అదృష్టమని, అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

'ఊర్జావీర్‌' ఇంటి నుంచే ఆదాయం - యువతకు ఇదో మార్గం: సీఎం చంద్రబాబు

కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్ర మార్గం ద్వారా పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా అని ప్రశ్నించారు.

అధికారులెవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు :గత ఐదేళ్లలో రాబందుల్లా గత పాలకులు, వారి అనుయాయులు భూములు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. అక్రమాలకు అవకాశం కల్పించే ల్యాండ్ టైట్లిలింగ్ యాక్ట్​ను రద్దు చేశామన్నారు. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భూ దురాక్రమణ నిరోధక చట్టం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు. ఇందుకు కారుకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో ఇచ్చిన దాదాపు 22 లక్షల ఇళ్ల పట్టాల్లోనూ పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందని, ఇందులో అనర్హులను తొలగించాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు ఎక్కువ భాగం భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కరానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు మూడు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణలో అధికారులెవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details