Cockfighting Preparations Ramp Up Ahead of Sankranti in West Godavari : సంక్రాంతి వచ్చిదంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. ఈ సారి పండుగకు ముందే పోటీలు జోరందుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. గుట్టుగా సంక్రాంతికి ముందే పందేలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎలాంటి హడావుడి లేకుండా పందేలు వేస్తున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పందేలపై ఆసక్తి ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న వారికి మాత్రమే నిర్వాహకులు సమాచారం ఇస్తున్నారు. బరులు ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి లేకుండా రాత్రి 7 గంటల తర్వాత ట్రాక్టర్లతో చదును చేసి, లైట్లు పెట్టి తెల్లారేలోగా కథ ముగించేస్తున్నారు.
ఒకే ప్రాంతంలో తరచూ పందేలు వేయకుండా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రెండు నెలలుగా ఒక్కో వారం ఒక్కో మండలంలో పందేలు వేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారు మాత్రమే బరిలోకి వచ్చేలా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీయకుండా ముందుగానే ఫోన్లు తీసుకుంటున్నారు. తాజాగా ఉండి మండలం సీసలిలో భారీ ఎత్తున పందేలు వేశారు. ఒక్కో పందేనికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున రూ.50 లక్షలకు పైగా చేతులు మారాయని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భీమవరం శివారులోని ఖాళీ స్థలాల్లో రాత్రంతా నిర్వహించారు.