Waves rise on the Uppada beach :ఆకాశం మేఘావృతమయితే చాలు ఆ గ్రామాల్లో అలజడి మొదలవుతుంది. ఓ మోస్తరు వర్షం పడిందంటే జనంలో ఆందోళన రేగుతుంది. తుపాను హెచ్చరిక వెలువడిందంటే మాత్రం గజగజ వణికిపోతారు. సునామీలను తలపించేలా ఎగిసిపడే రాకాసి అలలు, బలమైన ఈదురు గాలులు ఆ పల్లెల జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. సముద్రమే జీవనాధారమైన అక్కడి ప్రజలకు ఆ కడలే వారి ఆవాసాలను కబళించేస్తుంది. ఇళ్లు-వాకిళ్లు, బడులు, గుడులు, చర్చిలు వందల ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో కలిపేసుకుంటుంది. తీర ప్రాంత మత్స్యకారులకు నిలువ నీడ లేకుండా చేసి నిరాశ్రయులుగా మారుస్తోంది. సముద్ర కోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరాల్లోని 8 గ్రామాలకు చెందిన ప్రజలకు దశాబ్దాలుగా అంతులేని వ్యథనే మిగుల్చుతోంది.
అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడ్డాయంటే సముద్రం అల్లకల్లోలంగా మారడం అలలు ఎగిసి పడటం సహజం. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఉప్పాడ, కోనపాపపేట తీర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తుపాను పేరు వినపడితే చాలు గజగజ వణికిపోతారు. కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తారు. అల్లకల్లోలంగా మారే సముద్రం, ఎగిసిపడే రాకాసి అలలు ఆయా తీర ప్రాంతాల్లో అంతులేని నష్టాన్నే మిగుల్చుతున్నాయి. కెరటాల తాకిడికి తీరం కోతకు గురై గృహాలు సముద్రంలో కలిసి పోతున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు కూకటి వేళ్లతో కూలుతున్నాయి. ఒకప్పుడు తమకు నీడనిచ్చిన ఆవాసాల జాడ ప్రస్తుతం కానరావడం లేదు. తీరం నానాటికీ సాగర గర్భంలో కలిసి నిలువ నీడ లేకుండా చేయడంతో బతుకు దుర్భరంగా మారుతోంది. కడలి కోత ఉప్పాడ తీర ప్రాంత అస్థిత్వాన్నే ప్రశ్నార్థంగా మార్చి ఇక్కడి ప్రజలకు గుండె కోతనే మిగుల్చుతోంది.
రెయిన్ అలర్ట్ : రాష్ట్రానికి వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరాన్ని ఆనుకొని 8 మత్స్యకార గ్రామాల్లో సుమారు 25వేల జనాభా నివసిస్తున్నారు. వీరిలో 16 వేల మత్స్యకారులు ఉన్నారు. సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో అనాదిగా జీవిస్తున్నారు. చేపల వేటతోపాటు ఆయా గ్రామాల్లో పంటలు పండించే వారు. ఇప్పడు ఆ భూమి అంతా సముద్రం గర్భంలో కలిసిపోయింది. ఉప్పాడ తీరంలో సముద్రం ఏడాది పొడవునా అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉవ్వెత్తున ఊళ్ల మీదకు ఎగిసిపడుతుంటాయి. దీంతో జనావాసాలు, పాఠశాలలు, ఆలయాలు, చర్చిలు సహా ఆయా గ్రామాల్లోని కట్టడాలు నేలమట్టమై కడలిలో కలిసిపోతున్నాయి. పంట భూములైతే నామ రూపాల్లేకుండా పోయాయి.
ఈ బాధలు భరించలేకపోతున్నాం - వంతెన ఎత్తు పెంచండి మహాప్రభో
ఉప్పాడ తీరంలోని కోనపాపపేట కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రాకాసి అలల ధాటికి ఈ గ్రామంలోని నివాసిత ప్రాంత భూమి తీవ్ర కోతకు గురవుతోంది. 4 వేలకుపైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు 200 మీటర్ల పరిధిలో జనావాసాలు ఉంటాయి. సుమారు 650 మంది మత్స్యకారులు సముద్రాన్ని ఆనుకొని నివసిస్తుంటారు. తుపాన్ల ధాటికి కడలి కోతకు గురవ్వడంతో 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. సుమారు 400 మంది నిరాశ్రయులయ్యాయి. ప్రస్తుతం 50 ఇళ్లు మాత్రమే మిగలాయి. అవి కూడా ప్రమాదపుటంచున కడలిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నివాసం ఉంటున్న 70 కుటుంబాలకు చెందిన 250 మంది మత్స్యకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఉప్పాడతో పాటు మిగతా తీర ప్రాంత గ్రామాలదీ ఇదే దుస్ధితి. రెండు నెలల వ్యవధిలో మూడు సార్లు వచ్చిన తుపాన్ల ధాటికి ఈ తీర ప్రాంత గ్రామాలు చిగుటాకుల్లా వణికిపోయాయి.