CM YS Jagan Cheated RTC Employees: జగన్ ప్రభుత్వానికి ఓ దండమంటూ ఆర్టీసీ ఉద్యోగులు కుమిలిపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేది. 2017లో చివరగా వేతన సవరణ చేశారు. 2017వ సంవత్సరం ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 22 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
అంతే కాకుండా సంస్థలోని 51 వేల మంది ఉద్యోగులందరికీ ఒకేసారి బకాయిలు ఇవ్వలేదు. తొలుత ఉద్యోగ విరమణ చేస్తున్న వారికే చెలిస్తామని మెలిక పెట్టారు. విలీనం కారణంగా వేతన సవరణ రూపంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోంది. కరవు భత్యం చెల్లింపులోనూ వాయిదాల పద్ధతినే జగన్ సర్కార్ పాటిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛన్‌ను తమకూ వర్తింపజేస్తారని నమ్మిన ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది. పాత పింఛను ఊసే ఎత్తొద్దంది. ఏ పింఛను ఇవ్వాలనే అంశంపై నాలుగేళ్లు కాలయాపన చేసింది. ఈపీఎఫ్ పింఛనులో కొనసాగుతారా? కాంట్రిబ్యూటరీ పింఛను పథకంలో (CPS) చేరి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (GPS) పొందుతారా? అని ఆప్షన్స్ ఇవ్వమంది. పదేళ్ల సర్వీసు ఉంటేనే జీపీఎస్‌కు అర్హత ఉంటుందని, 33 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తిస్థాయి జీపీఎస్ అందుతుందనే నిబంధనలు ఉన్నాయి. అత్యధిక ఉద్యోగులు ఈపీఎఫ్ (Employees Provident Fund) పింఛనులోనే కొనసాగుతామన్నారు.
గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్ - అయిదేళ్లుగా నియామకాలు నిల్
పథకాలను రద్దు చేశారు: ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో గతంలో కొనసాగిన రెండు పథకాలనూ ప్రభుత్వంలో విలీనమయ్యాక యాజమాన్యం రద్దు చేసింది. స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ (SBT) కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే బాధిత కుటుంబానికి లక్షన్నర రూపాయలతోపాటు, ఆ ఉద్యోగి నుంచి సేకరించిన చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు. ఉద్యోగి రిటైరైతే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు ఎస్బీటీ నిలిపేశారు.
వీరికి ఏపీ ప్రభుత్వ జీవిత బీమా (APGLIC) వర్తింపజేశారు. 55 ఏళ్లు దాటని వారికి ఏపీజీఎల్ఐసీకి అర్హత లేకపోవడంతో వారికి ఎస్బీటీనే కొనసాగుతోంది. ఎస్బీటీ రద్దైన వారికి ఇన్నేళ్లు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సి ఉంది. 2026-27 వరకు రిటైర్ అయ్యేవారికి మాత్రమే చెల్లించారు. ఆర్టీసీలో పదవీ విరమణ ప్రయోజనం పథకం (SRBS) కొనసాగింది. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత పక్కనబెట్టి, దానికి యాజమాన్య వాటా జతచేసి, ఉద్యోగి రిటైర్ అయితే నెలకు 3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు.
ఆ ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి అందులో సగం అందించేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎస్ఆర్బీఎస్ నిలిపేశారు. ఈ పథకం రద్దవడంతో, వారు ప్రతినెలా చెల్లించిన మొత్తాన్నీ వెనక్కి ఇవ్వాల్సి పరిస్థితి ఉంది. కానీ 2026-27 వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే సెటిల్‌మెంట్ చేశారు. మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు.