CM Revanth Reddy Chit Chat On Telangana Budget : ప్రాధాన్యతల ఆధారంగా వాస్తవిక బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలాగా అబద్దాల బడ్జెట్ తమది కాదని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. గత ఆర్థిక సంవత్సరం రూ.2.95 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, దానిని సవరించగా 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ. 2,24,625 కోట్లకు తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం 23 శాతం అదనంగా ప్రవేశపెట్టినట్లు వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్ కాదు - వాస్తవిక బడ్జెట్ : సీఎం రేవంత్
Deputy Chief Minister Bhatti Vikramarka :ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై ప్రసంగించేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేశారని, ఇందువల్లనే వార్షిక బడ్జెట్ గత ప్రభుత్వం మాదిరి అబద్దాల బడ్జెట్ కాదని స్పష్టం చేశారు. గత సర్కార్ చేసిన పాపం కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు తెచ్చిన అప్పులకు రూ.16 వేల కోట్ల వడ్డీలు కట్టాల్సి వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయమై ఇప్పటికే బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని, త్వరలో మాఫీ చేస్తామని వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసిన సీఎం, సాగునీటి శాఖపై శ్వేతపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
CM Revanth Reddy Chit Chat : మేడిగడ్డపై అందిన విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నామన్న రేవంత్ రెడ్డి. జ్యుడీషియల్ విచారణలో నిజానిజాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న రేవంత్ రెడ్డి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులతో పాటు అదనంగా అడిగి తెచ్చుకుంటామన్నారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తమ చేతుల్లో లేదని, సభాపతి పరిధిలో అంశమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ భాషనే తాను మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నాయకులకు ఈ నెల 13న వీలుకాకపోతే ఆ విషయం తమ దృష్టికి తీసుకొస్తే ఆలోచిస్తామన్నారు.