ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కుకు తుప్పు పట్టిస్తున్న సీఎం జగన్ - Vizag Steel Plant Privatization

CM Jagan Stance on Privatization of Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్ సాగర నగరం అస్తిత్వం. దానిపై కేంద్రం ప్రైవేటీకరణ కత్తి పెట్టింది. దిల్లీ మెడలు వంచుతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జగన్‌ ఇప్పుడు కిమ్మనడం లేదు. కేంద్రం వడివడిగా అడుగులేస్తుంటే కేసుల భయంతో కళ్లప్పగించి చూస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ 32 మంది బలిదానాలు చేస్తే జగన్‌ ఆ ప్లాంట్‌నే బలిపెడుతున్నారు. 22 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారు.

vizag_steel_plant
vizag_steel_plant

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:12 AM IST

విశాఖ ఉక్కుకు తుప్పు పట్టిస్తున్న సీఎం జగన్

CM Jagan Stance on Privatization of Vizag Steel Plant:ప్రత్యక్షంగా, పరోక్షంగా 75వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కో అడుగూ ముందుకేస్తుంటే దాన్ని కాపాడేందుకు సీఎం జగన్‌ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలేవీ చేయడం లేదు. తిరిగి తెరచాటున విశాఖ ఉక్కు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఎక్కడ కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయంతోనే పల్లెత్తు మాట అనడం లేదు. ప్రైవేటు స్టీలు కర్మాగారాలకు అడిగిందే తడవుగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్‌ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపానపోలేదు. ప్రస్తుతం ప్లాంటుకు సొంత గనుల్లేక ఎన్​ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది.

అంతర్జాతీయ ఎగుమతి ధరలనే చెల్లించాలే నిబంధనతో అదనపు భారం పడుతోంది. పైగా ఎన్​ఎండీసీ ఆధ్వర్యంలో ఉన్నఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్, బైలదిల్లా గనుల నుంచి రోజుకు 4 నుంచి 5 రేక్‌ల ఇనుప ఖనిజం సరఫరా కావాల్సి ఉండగా రెండు రేక్‌లకు మించడం లేదు. ఒడిశా మహానది కోల్‌ ఫీల్డ్‌ నుంచి ఐదేళ్లపాటు ఏడాదికి 16 లక్షల 80 వేల టన్నుల చొప్పున బాయిలర్‌ బొగ్గు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సరఫరా చేసేలా ఒప్పందం ఉంది. ఐతే ఇది ఏటా 25 శాతానికి మించడం లేదు. రైల్వే రేక్‌ల కొరతతో గతేడాది 4లక్షల 10 వేల టన్నులే సరఫరా చేశారు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి 3వేల 200 రూపాయలకు రాయితీ బొగ్గు లభ్యంకాక బయటినుంచి టన్నుకు 6వేల నుంచి10వేలకు తెచ్చుకుంటున్నారు.

2021లో స్టీలు ప్లాంటుకు 913 కోట్ల మేర లాభాలు వచ్చాయి. అయితే అవసరమైన ముడిసరకు కొనుగోలు చేయలేదు. ఫలితంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 మూతపడింది. దీనిని ప్రస్తుతం జిందాల్‌తో ఒప్పందం చేసుకుని నిర్వహిస్తుండటంతో ప్లాంటులోకి ఓ ప్రైవేటు సంస్థ అడుగుపెట్టినట్లయింది. రెండో ఆక్సిజన్‌ ప్లాంటును కూడా ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. బీఎఫ్‌-3 తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ బిడ్లు ఆహ్వానించింది. టాటా ఇంటర్నేషనల్‌ ముందుకొచ్చి బొగ్గు కోసం 820 కోట్లు ఇచ్చినా బీఎఫ్‌-3ని ప్రారంభించలేదు.

జిందాల్​తో స్టీల్​ ప్లాంట్​ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు

మరోవైపు ప్లాంటు భూముల అమ్మకానీ అడుగులు వేశారు. మొదట విశాఖలోని హెచ్‌బీ కాలనీ, ఆటోనగర్‌లోని 25 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత గంగవరం పోర్టుకు, స్టీలు ప్లాంటుకు మధ్య ఉన్న1,170 ఎకరాలు అమ్మేందుకు ప్రణాళికలు రూపొందించారు. సెయిల్‌ విస్తరణకు లక్షా 10వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ఉక్కు శాఖ నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేస్తే 20 నుంచి 30 వేల కోట్లతోనే ఉత్పత్తి లక్ష్యం సులువుగా నెరవేరుతుందన్న ప్రతిపాదనను కేంద్రం పెడచెవిన పెట్టింది. ప్లాంటులో కీలక పోస్టులు 70 శాతం ఖాళీగా ఉన్నా కొన్నేళ్లుగా నియామకాలు నిలిపేశారు. తాజాగా వాలంటరీ సెల్ఫ్‌ సెపరేషన్‌ స్కీమ్‌ తీసుకొచ్చి ఉద్యోగులను తగ్గించేందుకు అడుగులు వేస్తున్నారు.

మరోవైపు జగన్‌ నిర్లక్ష్య వైఖరి కూడా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పాలిట శాపంగా మారుతోంది. విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్‌ గని లీజును తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు పొడిగించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్‌ గనులు, నెల్లిమర్లలోని సిలికా, అనకాపల్లిలోని క్వార్ట్జ్‌ మైనింగ్‌ లీజు గడువును జగన్‌ ప్రభుత్వం పొడిగించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలు కూడా ప్లాంటుకు అదనపు భారంగా పరిణమించాయి. గతంలో నెలకు 25నుంచి 30 కోట్ల వరకు వచ్చే కరెంట్‌ బిల్లు ప్రస్తుతం 85 నుంచి 90 కోట్లకు పెరిగింది. దీనికి తోడు తగినంత విద్యుత్‌ సరఫరా లేక బహిరంగ మార్కెట్లో అధిక ధర పెట్టాల్సివస్తోంది.

ఇది చాలదన్నట్లుగా బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. నెలకు 500 కోట్ల చొప్పున నాలుగు నెలలకు సంబంధించి 2 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని స్టీలు ప్లాంటు అధికార వర్గాలు, కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టాయి. ప్రతిగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, గృహ నిర్మాణాలకు ప్రభుత్వ ఇతర అవసరాలకు స్టీలు తీసుకెళ్లాలని కోరాయి. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయించాల్సిన ఈ అంశాన్ని జిల్లా పరిశ్రమల శాఖ అధికారితో కంటితుడుపుగా ఓ కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వాలని పక్కనపెట్టేశారు.

ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు

గంగవరం పోర్టులో 10 శాతం వాటాను జగన్‌ సర్కారు అదానీకి కారుచౌకగా కట్టబెట్టడంతో రాష్ట్రప్రభుత్వ ఆజమాయిషీ కోల్పోయింది. గతంలో స్టీలు ప్లాంటు ముడిసరుకు నిల్వ చేసేందుకు ప్రత్యేక యార్డు, ఓడలకు ప్రత్యేక బెర్తు కేటాయించేవారు. ఇప్పుడు అవన్నీ లేవు పైగా పోర్టులో హ్యాండ్లింగ్‌ ఛార్జీలను పెంచారు. ఈ ఛార్జీలు గతంలో టన్నుకు 270 ఉండగా ఇప్పుడు అదనంగా 55 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో స్టీలు ప్లాంటుకు సంబంధించి ఎప్పుడూ 50 కోట్ల రూపాయలమేర మార్జిన్‌ ఉంచి, మిగిలిన సొమ్ము చెల్లిస్తూ నౌకల్లో వచ్చిన ముడిసరకు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు పాత బకాయిలు చెల్లిస్తేనే ఓడల్లోని సరకు దించుతామంటూ అదానీ పోర్టువారు పేచీ పెట్టడంతో డెమరేజ్‌ ఛార్జీలు సైతం కర్మాగారమే మోయాల్సి వస్తోంది.

రాష్ట్రం నుంచి మెజార్టీ సంఖ్యలో ఉన్న వైసీపీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బలంగా గళమెత్తిందే లేదు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కీలకమైన ఉక్కు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉండి కూడా సొంత గనులు కేటాయించేలా, సక్రమంగా ముడిసరకు సరఫరా చేసేలా కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీయలేకపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో నగర్నార్‌ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. అలాంటి పరిస్థితిని ఇక్కడి ఎంపీలు ఇక్కడ తీసుకురాలేకపోయారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా గళం విప్పలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించలేదు.

What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..?

వాజ్‌పేయి హయాంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వస్తే అప్పటి టీడీపీ ఎంపీలు అన్ని పార్టీల నేతలతో అఖిలపక్షంగా ఏర్పడి ప్లాంట్‌ను కాపాడుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే లేదు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయడం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైవీ సుబ్బారెడ్డి 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి మోదీకి పంపామమని ఎన్నికల స్టంట్లు వేయడం తప్ప ప్లాంట్‌ పరిరక్షణకు చేసిందేమీ లేదు.

స్టీలు ప్లాంటును ప్రైవేట్‌పరం చేస్తామని 2021 ఫిబ్రవరి 2న కేంద్రం ప్రకటించినప్పటి నుంచి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. జగన్‌ సర్కారు మాత్రం ఉక్కు కర్మాగారం పరిరక్షణను పట్టించుకోకుండా మొక్కుబడిగా లేఖలు రాసి వదిలిపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు పలుకుతోందనే అనుమానాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details