CM Jagan Photos on Everything, Govt Misusing Public Funds:కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు, అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు, వారసత్వంగా వచ్చిన పొలాలు, ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. వాటిపై తన ఫొటో, వైఎస్సార్సీపీ రంగుపడిందా? లేదా? అన్నదే ప్రధానం. ఉప్పు, పప్పు, నీరు, బియ్యం రాళ్లూరప్పలు, ఓపీ స్లిప్పులు, బడిలోని నోటుబుక్కులు, విద్యార్థుల బెల్టులు, శ్మశానాలు, భూహక్కులు, మరణ ధ్రువీకరణ పత్రాలపై తన బొమ్మ, పార్టీ రంగులు వేయించుకున్నారు. రూ. కోట్ల నిధులను గంగలో కలిపారు జగన్!
‘ప్రజలకు ఏం చేశాం అన్నది ప్రధానం కాదు ప్రచారం ఎంత చేశాం అనేది ముఖ్యం’ ఇదీ జగన్ తన ఐదేళ్ల పాలనలో అనుసరించిన విధానం. పథకం ఏదైనా, కార్యక్రమం ఎలాంటిదైనా జగన్ బొమ్మ పడాల్సిందే. ఆస్పత్రా, నీటి ట్యాంకా, ప్రభుత్వ కార్యాలయమా అన్నది అనవసరం. వాటిపై వైఎస్సార్సీపీ రంగు పడాల్సిందే. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రచార యావతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలపై, తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై ఫొటోలను ముద్రించుకోవడానికీ వెనకాడలేదంటే జగన్ ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. నా భూమిపై నీ పేరేంటి? నీ పెత్తనమెందుకు?’ అని అన్నదాతలు నిలదీసినా సమాధానాలు చెప్పలేదు జగన్. పొలాలు, ఇళ్లు, శ్మశానాల్లోని హద్దురాళ్లకూ జగనన్న’ పేరు పెట్టేసి వికృతానందం పొందారు. అన్నింటికి తన బొమ్మ, పేరు ఉంటే ‘దిష్టి’ తగులుతుందనుకున్నారో ఏమో కొన్ని పథకాలకు ‘వై.ఎస్.ఆర్’ పేరు పెట్టారు. ఇలా మొత్తం 120కి పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై జగన్ బొమ్మలూ, ముద్రలే కనిపిస్తున్నాయి. అందుకు అయిన ప్రచార ఖర్చు రూ.5 వేల కోట్లు. ఇదంతా జనం సొమ్మే.
ప్రజల ప్రశ్నలకు బదులేదీ?:ప్రైవేటు వ్యక్తుల ఆస్తిపత్రాలపై జగన్ తన బొమ్మ ఎలా వేసుకుంటారని మేధావులు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలు ఎండగడుతున్నారు. భూమి నాది, పుస్తకం నాది మధ్యలో ఈ జగన్ పైత్యం ఏంటీ?’ అని కొందరంటున్నారు.
రంగుల ఖర్చు రూ.2,300 కోట్లు: వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తొలుత టిడ్కో ఇళ్ల రంగులు మార్చింది. తర్వాత అన్న క్యాంటీన్లు,నీటి ట్యాంకులు, ఆస్పత్రులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రంగులు అద్దేసి రాక్షసానందం పొందింది. కొత్తగా నిర్మించే సచివాలయాలకు మూడు రంగులు వేయాలని 2019లో అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం ఫలితంగా ఖజానాపై పడిన భారం రూ.1,300 కోట్ల పైమాటే. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేసి రంగులు వేశారు. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రంగులకే రూ.2,300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేసింది.