CM Jagan Negligence in Nadu Nedu Works :2020 ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి జగన్ నోటివెంట ఎన్నో మాటల వచ్చాయి. ఇప్పుడు ఆ మాటలు పూర్తి రివర్స్ అయ్యాయి. ఓ వైపు 'నాడు- నేడు' పేరుతో కోట్లు వెచ్చించి పనులు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు తరగతుల విలీనం పేరుతో అవే పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా చేస్తోంది. విద్యార్థులున్న చోట మాత్రం పనులను పూర్తి చేయడం లేదు.
Nadu Nedu Works in AP :ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల విలీనం పేరిట ప్రాథమిక విద్యలో విధ్వంసం సృష్టిస్తోంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానం అంటూ ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతుల్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేస్తోంది. ఓ వైపు విద్యార్థులు తగ్గిపోతుండగా మరోవైపు నాడు-నేడుకింద చేసిన కోట్ల రూపాయల పనులు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. నాడు- నేడు కింద 15 వేల 715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. దీని కోసం 3 వేల 669 కోట్లు ఖర్చు చేశారు. 2019 నవంబరు 14న మొదలు పెట్టిన పనులను 2021 ఆగస్టు 16 నాటికి పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ పనులు చేసిన బడుల్లోనుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. 212 ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 3 నుంచి 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు.
నిధులు లేక నిలిపివేసిన నాడు-నేడు పనులు - శిధిల భవనంలోనే తరగతుల నిర్వహణ
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ ప్రాథమిక పాఠశాలలో 24 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. గతంలో 1 నుంచి 5 తరగతుల్లో 126 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 1, 2 తరగతుల్లో 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు.